Aug 24,2023 07:45
  •  30న సామూహిక గృహప్రవేశాలు
  •  కాకినాడలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : తొలి విడతలో ఐదు లక్షల ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని ప్రభుత్వం మొదటి నుంచీ చెప్తూ వస్తోన్న ఈ నెల 30న జరిగే ఈ కార్యక్రమంలో 9,832 ఇళ్లకే పరిమితం కానుంది. లేఅవుట్లలో కనీసం వంద ఇళ్లు పూర్తయి అన్ని రకాల సౌకర్యాలూ ఉన్న వాటిలోనే ప్రవేశం చేయించనున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలోని 2వ వార్డులో ఆ రోజున ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 2,299 ఇళ్లను ప్రారంభించనున్నారు. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ఎంపిక చేసిన లేఅవుట్లలో ఒక్కో మంత్రి మిగిలిన ఇళ్లను ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్లు పూర్తి, కార్యక్రమం నిర్వహణకు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఐదేసి జిల్లాలను ఒకరు పర్యవేక్షిస్తున్నారు. గృహాలకు విద్యుత్‌, మంచినీరు సదుపాయం కల్పించాలని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లకు నీలం రంగు, స్వాగత తోరణాలు, ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయాలని సూచించింది. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు (ఎన్‌పిఐ) పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 16,60,171 ఇళ్లను మంజూరు చేసింది. వీటిని పలు దశల్లో చేపడుతూ 2024 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వీటిలో తొలుత ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 4.87 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. అయితే, లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన అంతమాత్రంగా ఉంది. సొంత స్థలాల్లో నిర్మించుకుంటున్న ఇళ్లకు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కొంతవరకు బాగానే కల్పించినా, జగనన్న లేఅవుట్లలో మాత్రం తీవ్ర వెనుకబాటు కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న పరిస్థితే ఇందుకు ఉదాహరణ. జిల్లాలో ఇప్పటివరకు 29,094 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిలో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారు 23,745 మంది, జగనన్న లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకుంటున్న వారు 5,349 మంది ఉన్నారు. వీటిలో ఇప్పటివరకు 25,553 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామని అధికారులు చెప్తున్నారు. ఇందులో సొంత స్థలాల్లో నిర్మాణం చేపట్టిన 21,820 ఇళ్లకు ఇవ్వగా, లేఅవుట్లలో కేవలం 3,127 ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. తాగునీటి సౌకర్యం 25,266 ఇళ్లకు కల్పించారు. వీటిలో సొంత స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లు 22,480, లేఅవుట్లలో ఇళ్లు నిర్మించుకున్న ఇళ్లు 2,786 ఉన్నాయి. విద్యుత్‌, తాగునీటి సరఫరా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు బకాయిలు ఉండడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయన్న చర్చ నడుస్తోంది.

గతంలో నాలుగు పర్యాయాలు వాయిదా

సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు వాయిదా పడింది. 2022లో విజయదశమి రోజున నిర్వహిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ పుట్టిన రోజైన డిసెంబర్‌ 21 చేపట్టాలని నిర్ణయించింది. గృహ నిర్మాణాల లక్ష్యం కనీసం సగం కూడా పూర్తి కాకపోవడంతో వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 22న ఉగాది సందర్భంగా అందరితో గృహ ప్రవేశాలు చేస్తామని ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌, అనుకున్న లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణం పూర్తి పూర్తి కాకపోవడంతో మరోసారి వాయిదా వేసింది. ఐదు లక్షల ఇళ్లకు అన్ని రకాల మౌలిక వసతులూ కల్పించాలంటే మరింత జాప్యమవుతుందని భావించిన ప్రభుత్వం, పూర్తి స్థాయిలో సిద్ధమైన ఇళ్లను ఈ నెల 30న ప్రారంభించేందుకు సమయాత్తమవుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, అందులో భాగంగానే సామూహిక ఇళ్లనూ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.