- ఇతర కేటగిరీలలో వాటా వద్దు
- వైసిపి బిసి ఆత్మీయ సమ్మేళనం నిర్ణయం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ సామాజిక వర్గాన్ని ఎస్‌సి జాబితాలో చేర్చాలని, ఎస్‌టి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేయడం సహేతుకం కాదని వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం సమిష్టిగా పట్టుబట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బిసి ఆత్మీయ సమ్మేళనం పేర్కొంది. తాడేపల్లి సిఎస్‌ఆర్ కల్యాణ మండపంలో రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సదస్సులో వైసిపి పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడారు. బిసిలను ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానాలకు తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. క్యాబినెట్‌లో, కార్పొరేషన్ పదవుల్లో బిసిలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. 139 బిసి కులాలు ఏకతాటి మీద నిలబడాలని కోరారు. కొన్ని కులాలు విడిపోయి ఇతర కులాల్లో చేర్చాలని డిమాండ్ చేయటం వల్ల ప్రయోజనం వుండదని అన్నారు. బిసి రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో పెట్టామన్నారు. జనాభా లెక్కల్లో బిసిల గణన చేయాలని డిమాండ్ చేశామన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బిసిలకోసం జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను తెచ్చారని అన్నారు. డెహ్రాడూన్, చత్తీస్‌గఢ్, గుజరాత్‌లలో జరిగిన స్పీకర్ల సదస్సులో జగన్‌మోహన్‌రెడ్డి గురించే చర్చ జరిగిందని చెప్పారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బిసి ముఖ్యమంత్రులు వున్న రాష్ట్రాల్లో కూడా బిసిల కోసం ఇన్ని పనులు చేయలేదన్నారు. 56 కార్పోరేషన్లు తెచ్చి అందరికీ గుర్తింపు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి మంత్రులు బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, గుమ్మనూరు జయరాం, వేణుగోపాలకృష్ణ, విడదల రజని, ఎంపిలు గోరంట్ల మాధవ్, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత తదితరులు మాట్లాడారు.










