Nov 01,2023 09:36
  • సిఎం క్యాంపు కార్యాలయంపై కమిటీ నివేదిక
  • త్వరగా చర్యలు తీసుకోండి : జగన్‌ ఆదేశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సిఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖపట్నంలోని రుషికొండ పర్యాటక భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను కమిటీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మంగళవారం సాయంత్రం అందచేసింది.
          ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ కమిటీ సిఫార్సుల మేరకు అవసరమైన చర్యలను సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం ఆ ప్రాంతంలో తరచు పర్యటనలు చేసి, సమీక్షలు నిర్వహించడానికి వీలుగా సిఎం క్యాంపు కార్యాలయంతో పాటు, ఉన్నతాధికారులు కూడా క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం వసతుల నిర్ధారణ కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
 

                                                                         ఐదు చోట్ల పరిశీలించి...

ఐదు చోట్ల పరిశీలించిన అనంతరం సిఎం క్యాంపు కార్యాలయానికి రుషికొండ పర్యాటక భవనాలే సరైనవని గుర్తించినట్లు కమిటీ తెలిపింది.సిఎం క్యాంపు కార్యాలయం, వసతి, అధికారుల సమావేశాల కోసం సరిపడా గదులు, భద్రతా సిబ్బంది ఉండేందుకు సదుపాయాలు, భద్రతాంశాలు, ట్రాఫిక్‌ సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ పేర్కొంది.
 

                                                                                వసతులు ఇలా

రిషికొండలోని సిఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయదలుచుకున్న భవనాల్లో ఒకటైన విజయనగర బ్లాకులో ప్రెసిడెన్షియల్‌ సూట్‌, సూట్‌ రూములు, బాంక్వెట్‌ హాల్‌ ఉంది. కళింగ బ్లాకులో బాంక్వెట్‌ హాల్‌, సూట్‌ రూములు, డీలక్స్‌ సూట్లు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ రూములు ఉన్నాయి. చోళ బ్లాకులో కాన్ఫరెన్స్‌ హాలు, పల్లవ బ్లాకులో సూట్‌ రూములు, కాన్ఫరెన్స్‌ హాలు నిర్మించారు. గజపతి బ్లాకులో రెసిడెన్షియల్‌ లాంజ్‌, బిజినెస్‌ సెంటర్‌, వేంగీ బ్లాకులో ప్రైవేటు సూటు రూములు ఉన్నాయి. ఈస్ట్రన్‌గంగా బ్లాకులో 225 మందికి సరిపోయే రెస్టారెంటు, కిచెన్‌, 30 వాహనాలు పార్కింగు చేసుకునే సదుపాయం కల్పించారు. రుషికొండ ప్రాంతంలో 17.965 ఎకరాల్లో నిర్మాణాలు ఉన,్నట్లు గుర్తించారు. వీటిల్లో 9.88 ఎకరాల్లో నిర్మాణాలు చేశారు.