- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
- వివాదాల పరిష్కారానికి సంప్రదింపులు వెంటనే ప్రారంభించాలి
- మూడున్నర నెలలైనా ఇప్పటికీ ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు
- మీడియాతో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో హింసను అరికట్టేందుకు నిర్మాణాత్మక చర్యలు లేవని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. నలుగురు సభ్యులతో కూడిన సిపిఎం బృందం మూడు రోజుల మణిపూర్ పర్యటన ఆదివారంతో ముగిసింది. బృందానికి నాయకత్వం వహించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఢిల్లీకి చేరుకుని, సోమవారం సిపిఎం కేంద్ర కార్యాలయం (ఎకెజి భవన్) వద్ద మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని అన్నారు. హింస కొనసాగుతోందని, అయితే ఈ విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు ఏం చేయాలో రాష్ట్రప్రభుత్వం చేయలేదని విమర్శించారు. తాము అక్కడ ఉన్నప్పుడే మరో దాడి జరిగిందని, మరో ముగ్గురు వ్యక్తులు చనిపోయారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక చేయలేదని తమకు అర్థమైందన్నారు. సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు తమ సహకారాన్ని అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామన్నారు.
రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలను ప్రారంభించాలని, చర్చలొక్కటే మణిపూర్ సమస్యకు పరిష్కార మార్గమని అన్నారు. సంప్రదింపుల ప్రక్రియ నిర్వహించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. అలాగే అన్ని వర్గాల ప్రజల ప్రతినిధులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఒక అవగాహనకు రావచ్చని తెలిపారు. హింస, అల్లర్లు కొనసాగి మూడున్నర నెలలు కావస్తున్నా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదని విమర్శించారు. అక్కడి ఘటనలు అమానవీయంగా ఉన్నాయని, కొన్ని చూడలేని పరిస్థితిలో నెలకొన్నాయని తెలిపారు. మణిపూర్‌లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మణిపూర్ గవర్నర్‌తో భేటీ అయ్యామని, అలాగే పది లౌకిక ప్రతిపక్ష పార్టీల నేతలను కలిశామని తెలిపారు. వారితో చర్చించామని పేర్కొన్నారు. వివిధ వర్గాల పౌర సమాజ ఉద్యమ నేతలను కలిశామని, రెండు వర్గాల బాధితులుండే సహాయక శిబిరాలను సందర్శించామని చెప్పారు. మణిపూర్ పర్యటనపై రిపోర్టు తయారుచేసి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.










