- దేశాన్ని ఎందుకు అంతగా ద్వేషిస్తోందో ?
- ప్రతిపక్ష కూటమి పేరు పెట్టడంతోనే ఇండియా పేరు మార్పు
- ఇది చాలా విచిత్రం..రాజ్యాంగ విధ్వంసం
- ఆర్టికల్ 1లో ఇండియా గురించి స్పష్టం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇండియా పేరును భారత్‌గా మార్చాలని బిజెపి చేసే ప్రయత్నం ''అపరిపక్వత''తో ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ''ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'' అని సూచించే జి20 విందు ఆహ్వానంపై వివాదం చెలరేగడంతో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష కూటమి ఇండియా పేరును పెట్టడం పట్ల అధికార బిజెపి కలవరపడుతోందని విమర్శించారు. ''ఇది చాలా విచిత్రం. మనకు రాజ్యాంగం ఉంది. శతాబ్దాలుగా దేశం ఎలా ప్రసిద్ధి చెందిందో తెలుసు. మన స్వతంత్ర భారతదేశాన్ని మనం వారసత్వంగా పొందాము. రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్‌లో 'ఇండియా అనే భారతదేశం రాష్ట్రాల యూనియన్' అని స్పష్టంగా పేర్కొందని అన్నారు.
''మా వైవిధ్యం, బహుళత్వం, ఇలా ప్రతిదీ రాజ్యాంగంలో చేర్చబడింది. బిజెపి ఈ మార్పు ఎందుకు చేస్తుంది? ఇండియా నామకరణం కింద లౌకిక ప్రతిపక్షం కలిసి రావడంతో బిజెపి నేతలు బాధపడుతున్నారా? అది వారి సమస్యా? బిజెపి భారతదేశాన్ని ఎందుకు అంతగా ద్వేషిస్తోందో మాకు తెలియదు'' అని పేర్కొన్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఐఐటిలు, ఐఐఎంల పేర్లలో కూడా ''ఇండియా'' అనే పదం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని ఉందని తెలిపారు. దాన్ని 'భారత్'గా మార్చడం వెనుక ఉద్దేశమేంటన్నది ప్రశ్నార్థకమే అని అన్నారు. ''ఇండో-పసిఫిక్ ఉంది%ౌౌ% బిజెపి ఈ మార్పు దేని కోసం చేస్తుంది? '' అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు తమ గ్రూపునకు ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) అని పేరు పెట్టడంతోనే పేరు మార్చాలని ఆలోచనకు బిజెపి వచ్చిందని ఏచూరి దుయ్యబట్టారు. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) అనే పదంతో కేంద్ర ప్రభుత్వం రెచ్చిపోతోందని విమర్శించారు. ''ప్రతిపక్షాలు, లౌకిక శక్తులు ఇండియా పేరుతో ఒక్కటయ్యాయి. ఇండియాతో వాళ్ల (బిజెపి)కు ఇబ్బందిగా ఉంది. అందుకే వాళ్లు భారత్ అంటున్నారు. ప్రతిపక్షాలు 'ఇండియా' అనే సంక్షిప్త రూపాన్ని సృష్టిస్తే బిజెపి వణికిపోతుంది'' అని సీతారాం ఏచూరి అన్నారు. ఇది భారత రాజ్యాంగ విధ్వంసమని, ఇది చాలా అపరిపక్వ ప్రతిస్పందన అని విమర్శించారు.










