Aug 31,2023 07:27
  •  ఇజ్రాయిల్‌ సంస్థల నుంచి పరికరాలు కొంటున్న మోడీ ప్రభుత్వం
  •  టెలికం కంపెనీల ద్వారా సమాచార సేకరణ
  •  సహకరిస్తున్న భద్రతా సంస్థలు

న్యూఢిల్లీ : దేశంలోని ఇడి, సిబిఐ, ఆదాయపు పన్ను వంటి సంస్థలు ఇప్పటికే మోడీ ప్రభుత్వ తాబేదారులుగా మారిపోయాయి. ఇప్పుడు ఆ జాబితాలో విదేశీ నిఘా సంస్థలు కూడా చేరాయి. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొడ్డిదారిన సేకరించి, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్‌ టెక్నాలజీ సంస్థల నుంచి శక్తివంతమైన నిఘా పరికరాలను కొనుగోలు చేస్తోంది. పెగాసస్‌ స్పైవేర్‌ వివాదం సద్దుమణగక ముందే మోడీ ప్రభుత్వం మరోసారి బరితెగించింది. లండన్‌ నుండి పనిచేస్తున్న 'ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌' పత్రిక ప్రచురించిన సంచలన కథనం ప్రకారం... నిఘా వ్యవస్థకు సంబంధిం చిన హార్డ్‌వేర్‌ను విదేశీ సంస్థలు సముద్ర గర్భంలోని కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్లకు అనుసంధానం చేస్తాయి. దీనిని దేశీయ టెలికం సంస్థలు ఉపయోగించుకొని భద్రతా సంస్థలకు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, ఇతర వివరాలను అందజేస్తాయి. ఇదంతా పైకి చూడడానికి చట్టబద్ధంగానే జరుగుతోంది. ఈ హార్డ్‌వేర్‌ కోసం కృత్రిమ మేథ, డాటా ఎనలిటిక్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను నిఘా సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి.
భారత్‌కు, ప్రపంచంలోని ఇతర దేశాలకు మధ్య సమాచార మార్పిడి కోసమే సముద్ర గర్భంలోని కేబుల్స్‌ను ఉపయోగించుకుం టున్నామని చెబుతున్నప్పటికీ శక్తివంతమైన నిఘా పరికరాలను విక్రయించే ప్రైవేటు కంపెనీలకు మార్గం సుగమం చేయడమే దీని ప్రధాన ఉద్దేశంగా కన్పిస్తోంది. మన దేశంలోని వేహియర్‌, ఇజ్రాయిల్‌కు చెందిన అనామక కాగ్నైట్‌, సెప్టియర్‌ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. సెప్టియర్‌ అనే కంపెనీని 2021లో అట్లాంటిక్‌ కౌన్సిల్‌ 'బాధ్యతారాహిత్య సంస్థ'గా అభివర్ణించింది.

కఠిన నిబంధనలేవి?

ఇతర ప్రజాస్వామిక దేశాలలో ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉంటాయి. సముద్ర గర్భంలోని కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్లు, డాటా సెంటర్లలో నిఘా పరికరాలను అమర్చే టెలికం కంపెనీలు కొన్ని షరతులకు లోబడి ప్రభుత్వ అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో ఇలాంటివేమీ లేవు. అమెరికా, బ్రిటన్‌ దేశాలలోని సంస్థలు ఇలాంటి దొడ్డిదారి ఏర్పాట్ల ద్వారా పెద్ద ఎత్తున నిఘాకు పాల్పడుతున్నాయని, ప్రభుత్వ ఒత్తిడితో టెలికం కంపెనీలు అధికారికంగానే వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తున్నాయని స్నోడెన్‌ టేపులు బయటపెట్టడంతో దుమారం చెేలరేగింది. చివరికి 'నిఘా' కోసం ప్రభుత్వాల నుండి అభ్యర్థలను వచ్చిన సందర్భంలో అందుకు కోర్టు అనుమతి తీసుకోవాలని ఆ కంపెనీలు నిర్ణయించాయి.

ఈ కంపెనీలన్నీ అలాంటివే

ఇజ్రాయిల్‌కు చెందిన సెప్టియర్‌ కంపెనీని 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. చట్టబద్ధమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కంపెనీ ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోకు, వొడాఫోన్‌ ఐడియాకు, సింగపూర్‌కు చెందిన సింగ్‌టెల్‌కు విక్రయించింది.ఇజ్రాయిల్‌ కంపెనీ కాగ్నైట్‌ కూడా మన దేశంలో నిఘా సమాచారాన్ని అందజేస్తోంది. భారత్‌, అమెరికా దేశాలలో ప్రధాన కార్యాలయాలు ఉన్న వేహియర్‌ కంపెనీ కూడా ఇలాంటిదే. ఇటు మోడీ ప్రభుత్వం కానీ, అటు ఆయా కంపెనీలు కానీ దీనిపై పెదవి విప్పడం లేదు.

వెల్లువెత్తుతున్న ఆరోపణలు

జలాంతర్గాముల కేబుల్‌ ప్రాజెక్టులలో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ విలేకరి ఏం చెప్పారంటే... సముద్ర గర్భంలోని కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్లు, డాటా సెంటర్లలో నిఘా పరికరాలు అమర్చాలని భారత ప్రభుత్వం బాహాటంగానే టెలికం కంపెనీలను కోరింది. ఇజ్రాయిల్‌ గ్రూప్‌ ఎన్‌ఎస్‌ఓకు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ను మోడీ ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని ప్రతిపక్ష నేతలు, పాత్రికేయు లు, హక్కుల కార్యకర్తలు 2019, 2021 సంవత్సరాలలో ఆరోపించారు. పెగాసస్‌ స్పైవేర్‌ ఓ లింకు ద్వారా మొబైల్‌ ఫోన్లను హ్యాక్‌ చేస్తోందని, ఇ-మెయిల్స్‌, కాల్స్‌, టెక్స్ట్‌ మెసేజ్‌లను రహస్యంగా రికార్డు చేస్తోందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. పెగాసస్‌ స్పైవేర్‌ బండారాన్ని బయటపెట్టేందుకు 2021 జూలై 16న వైర్‌, ఫ్రాన్స్‌ మీడియా సంస్థ ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ చేతులు కలిపాయి. దీనిపై ఎన్‌ఎస్‌ఓ సంస్థ స్పందిస్తూ భారత్‌ సహా పలు దేశాల ప్రభుత్వాలకు మాత్రమే దీనిని విక్రయించామని తెలిపింది.