Dec 31,2022 21:47

- 2022లో జగన్‌ విధ్వంస పాలన : చంద్రబాబు
- 'కందుకూరు' ఘటనలో రాజేశ్వరి కుటుంబ సభ్యులకు పరామర్శ

ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో/ నెల్లూరు ప్రతినిధి :కందుకూరు ఘటనలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధాకరమని టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఈదుమూడి రాజేశ్వరి కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి పార్టీ తరపున రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. కందుకూరు ఘటన బాధాకరమని పేర్కొన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు సభకు వేలాదిగా టిడిపి కార్యకర్తలు వస్తారని తెలిసి కూడా రక్షణ కల్పించలేదని విమర్శించారు. నందిగామలో జరిగిన సభలో తనపై రాయి విసిరితే పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదన్నారు. కర్నూలులో వైసిపి మూకలు వస్తే పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. కందుకూరు ఘటన సమయంలో తాను అప్రమత్తం చేశానని తెలిపారు. పోలీసులు ఎక్కడా కనిపించలేదని, వెంటనే బాధితులను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లానని తెలిపారు. సభను రద్దు చేసుకున్నానని, పార్టీ ద్వారా, నేతల ద్వారా కలిపి రూ.25 లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు ఇచ్చామన్నారు. ఎనిమిది మంది కార్యకర్తలను కోల్పోయి బాధలో ఉంటే, వైసిపి నాయకులు నీతి మాలిన విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. వీళ్లు మనుషులేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కచ్చలూరు బోటు ప్రమాదం జరిగినా, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినా కూడా జగన్‌ వెళ్లలేదని విమర్శించారు. జగన్‌ పాలనలో 2022 విధ్వంసాల పాలనగా మిగిలిపోయిందని, 2023లో బాధలన్నీ తొలగిపోయి అందరికి మంచి జరగాలని చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు.
అంతకు ముందు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాళెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రం కోసం, పార్టీ కోసం త్యాగాలు చేయడం మా నేతలకు కొత్తేమీ కాదు. అవసరాన్ని బట్టి పదవులు త్యాగాలు చేస్తారు'' అని అన్నారు. సమర్ధులకు అవకాశం ఇస్తామని తెలిపారు. ఎపి జెన్‌కో ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రతీఏడాదీ విధ్వంసాలేనని అన్నారు. మీడియా సహా వివిధ సంస్థలపై దాడి చేస్తున్నారని, సిఐడి కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, కరెంట్‌ ఛార్జీలు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయన్నారు. దేశంలో రైతులపై అత్యధిక అప్పున్న రాష్ట్రం ఎపినే అని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొందన్నారు. అందుకే యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని తెలిపారు. విద్యా వ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 2.70 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించామని, 90 శాతం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందించకుండా జగన్‌ తుప్పు పట్టించారని అన్నారు. విధ్వంసాల పాలనకు వ్యతిరేకంగా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతుందని, ఎవరో బెదిరిసే ఆగదన్నారు. సమావేశంలో టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డిచంద్రమోహన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, తదితరులు పాల్గన్నారు.