-రైలు ప్రమాద క్షతగాత్రులకు పరామర్శ
ప్రజాశక్తి- విజయనగరం టౌన్, కోట :రైలు ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి భరోసా ఇచ్చారు. విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రి వార్డుల్లో మొత్తం 29 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లి ఆయన పరామర్శించారు. రైలు ప్రమాదం జరిగిన తీరు, వైద్య సదుపాయంపై ఆరా తీశారు. వారిని ఓదార్చారు. పూర్తిగా కోలుకొనే వరకు వైద్య సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా కోలుకొనే విధంగా మరింత మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఆదేశించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ప్రమాద సంఘటనను వివరిస్తూ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. ప్రమాదం జరిగిన తీరును, తీసుకున్న సహాయ చర్యలను మంత్రి బత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రైల్వే ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు. మధ్యాహ్నం సుమారు 1.20 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్‌లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి 1.35 గంటలకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చారు. దీనికి ముందు ఆయన కంటకాపల్లి రైలు ప్రమాద స్థలాన్ని హెలికాప్టర్ నుంచి వీక్షించారు. ఆస్పత్రిలో దాదాపు గంటన్నర సమయం క్షతగాత్రులను, మృతుల బంధువులను పరామర్శించి, వైద్య సహాయంపై సమీక్షించిన అనంతరం సుమారు 3.35 గంటలకు తిరుగు పయనమయ్యారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రులు బత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ఎస్‌టి కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, వైసిపి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.










