Mar 06,2023 12:06

అమరావతి : తెలుగు రాష్ట్రాలకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తాజాగా హైఅలర్ట్‌ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ వివరాల ప్రకారం ... కొత్త ఫ్లూ వైరస్‌ ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్‌ ఫీవర్‌ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. ఇదిలా ఉంటే.. కోవిడ్‌ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం.

                                            యాంటీబయోటిక్స్‌ వాడేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి : ఐసిఎంఆర్‌

ఫ్లూ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వైరస్‌ను వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని, యాంటీబయోటిక్స్‌ వాడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అని ఐసిఎంఆర్‌ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలెవ్వరూ వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్‌ వాడకూడదని చెప్పింది. మరోవైపు ఇన్‌ఫెక్షన్‌లను నిర్ధారించుకోకుండా యాంటీబయోటిక్స్‌ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను ఐసిఎంఆర్‌ హెచ్చరించింది. ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐసిఎంఆర్‌ తెలిపింది.

ఫ్లూ లక్షణాలు కనిపిస్తే...
చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి.
ముఖానికి మాస్క్‌ ధరించాలి.
గుంపులోకి వెళ్లకపోవడం మంచిది.
ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి

ఇవి చేయకుండా ఉండటం మంచిది....
ఇతరులకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం,
బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం
గుంపుగా కలిసి తినకుండా ఉండడం
సొంత వైద్యం జోలికి పోకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం.