Sep 16,2023 10:46

న్యూఢిల్లీ : నిఫా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ చికిత్స కోసం ఆస్ట్రేలియా నుంచి మరో 20 డోసుల మోనోక్లోనల్‌ యాంటీబాడీని భారత్‌ కొనుగోలు చేస్తుందని ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ బహ్ల్ శుక్రవారం తెలిపారు. '2018లో ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్‌ యాంటీబాడీ డోసులు కొనుగోలు చేశాం. ప్రస్తుతానికి 10 మంది రోగులకు డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు ఎవరికీ ఈ ఔషధం ఇవ్వలేదన్నారు. 'ఇంకో ఇరవై డోసులు సేకరిస్తున్నాం. ఇన్ఫెక్షన్‌ ప్రారంభ దశలోనే ఈ ఔషధం ఇవ్వాలి' అని తెలిపారు. మరణాల విషయంలో పోలిస్తే కోవిడ్‌ (2 నుంచి 3 శాతం) కన్నా నిఫాలో మరణాల శాతం ( 40 శాతం నుంచి 70 శాతం) అధికమని తెలిపారు. కేరళలో ఈ నిఫా వైరస్‌ సోకిన వారందరూ మొదటి రోగికి సంబంధం ఉన్నవారేనని చెప్పారు. మోనోక్లోనల్‌కు సంబంధించి ఫేజ్‌ 1 పరీక్షలు విదేశాల్లో జరిగాయన్నారు. విదేశాల్లో ఈ నిఫా వైరస్‌ సోకిన 14 మందికి మోనోక్లోనల్‌ యాంటీబాడీ ఇవ్వగా, వారందరూ కోలుకున్నారని తెలిపారు. ఈ ఔషధాన్ని ఉపయోగించడం వైద్యులు, రోగి బంధువులు, కేరళ ప్రభుత్వం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.
 

                                                             83 మందికి నెగిటివ్‌ : కేరళ మంత్రి వీణాజార్జి

కేరళలో గత నెల 30న మరణించిన వ్యక్తికి వైద్య సేవలందించిన 30 మంది ఆరోగ్య కార్యకర్తలకు నిఫా టెస్టులు నిర్వహించగా, నెగిటివ్‌గా వచ్చిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. ఆయనతో కాంటాక్టులో ఉన్న మరో 53 మందికి కూడా నెగిటివ్‌గా వచ్చిందని చెప్పారు. తాజాగా కొరుకోడ్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి నిఫా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ వైరస్‌ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. నిఫా వ్యాప్తిని కట్టడిలో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఏడు పంచాయతీలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించింది. నిఫా వ్యాప్తి నేపథ్యంలో అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి.