Aug 16,2023 21:02

విజయవాడ: విద్యుత్‌ ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కార్యాచరణ ఇచ్చామని విద్యుత్‌ ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి తెలిపారు. ఈ అంశంపై ఆగస్టు 17వ తేదీన విద్యుత్‌ సౌధ వద్ద తలపెట్టిన మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో దీన్ని తాత్కాలికందా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ధర్నాకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తున్నామని వెల్లడించారు. కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాక స్ట్రగుల్‌ కమిటీ ధర్నా నిర్వహిస్తుందని.. అనంతరం మహాధర్నా తేదీని ప్రకటిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే విద్యుత్‌ ఉద్యోగులకు కూడా కనీసం 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్‌ ఉద్యోగులకు ప్రకటించిన 8శాతం ఫిట్‌మెంట్‌ను స్ట్రగుల్‌ కమిటీ అంగీకరించడం లేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. థర్డ్‌ పార్టీ విధానాన్ని తొలగించి విద్యుత్‌ యాజమాన్యాలే నేరుగా కార్మికులకు వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.