- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
ప్రజాశక్తి - లీగల్ రిపోర్టర్ (విశాఖపట్నం):దిగువ న్యాయస్థానాల్లో వచ్చే తీర్పులు ఉన్నత న్యాయస్థానాలకు ఒక నిఘంటువుగా ఉంటాయని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. విశాఖలోని జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో నిర్మించిన పది న్యాయస్థానాల నూతన భవనాలను ఆదివారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయమూర్తుల మధ్య భావ సుహృద్భావ వాతావరణం వల్ల ఉన్నతమైన తీర్పులు సాధ్యమవుతాయని తెలిపారు. న్యాయవాదులంతా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మెలగాలన్నారు. కాగితం లేని సాఫ్ట్‌వేర్ వాదనలతో తీర్పులు వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్ మాట్లాడుతూ తాజాగా ప్రారంభించిన న్యాయస్థానాల భవనాలను దేవాలయాలుగా అభివర్ణించారు. ప్రస్తుతం విశాఖలో 71 న్యాయస్థానాలు ఉన్నాయని, వాటిలో 29 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నూతనంగా నిర్మించిన న్యాయస్థానాలకు 15 వేలు కేసులను బదిలీ చేయనున్నట్లు చెప్పారు. నిజమైన బాధితులకు సేవలు అందించడమే న్యాయవాది అంతిమ లక్ష్యమని గుర్తు చేశారు. జస్టిస్ చీకటి మానవేందర్ రారు మాట్లాడుతూ విశాఖ నగరంలో న్యాయస్థానాలు 50కి పైగా ఉన్నప్పటికీ మౌలిక వసతుల లేమితో ఇన్నాళ్లు ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు కొంత వరకూ తొలగనున్నాయని చెప్పారు. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జస్టిస్ డివిఎస్.సోమయాజులు, జస్టిస్ చీమలపాటి రవి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలిపాటి గిరిధర్, న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చింతపల్లి రాంబాబు, పైలా శ్రీనివాసరావు, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.రామజోగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










