అమరావతి : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై నేడు విజయవాడ ఎసిబి కోర్టులో జరగాల్సిన విచారణ వాయిదాపడింది. రెండు పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఎసిబి కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ప్రకటించారు. విజయవాడ ఎసిబి కోర్టు జడ్జి మంగళవారం సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి వ్యవహరించారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు వాదనలు వినాలని చంద్రబాబు తరఫు లాయర్లు పట్టుబట్టారు... అయితే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళుతున్నట్లు తెలిపారు. బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించారు.










