న్యూఢిల్లీ : దేశంలో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల పట్ల మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్‌కు బుధవారం లేఖ రాశాయి. పాత్రికేయుల ఫోన్లు, లాప్‌టాప్‌లను ఇష్టానుసారం స్వాధీనం చేసుకోకుండా నిలువరించేందుకు నిబంధనలను, జర్నలిస్టుల విచారణకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించడంలో సాయపడాలని విజ్ఞప్తి చేశాయి. చట్ట విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వ సంస్థలు, అధికారుల్లో జవాబుదారీతనం ఉండేలా చూడాలని కోరాయి. పాత్రికేయులు చట్టానికి అతీతులని తాము భావించడం లేదని, చట్టానికి లోబడి తమను విచారించాలని మాత్రమే కోరుతున్నామని తెలిపాయి. ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై 16 పాత్రికేయ సంఘాలు సంతకాలు చేశాయి.
దేశంలోని పలువురు పాత్రికేయులు నేడు ప్రతీకార ప్రమాదాన్ని ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారని ఆ లేఖలో జర్నలిస్టు సంఘాలు తెలిపాయి. న్యూస్‌క్లిక్ పోర్టల్ పాత్రికేయులు, ఉద్యోగుల నివాసాలపై జరిగిన దాడులను, వారి నుండి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న వైనాన్ని వివరించాయి. 'పత్రికలకు వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థలు పలు సందర్భాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయం మీకు తెలిసిందే. న్యూస్‌క్లిక్ పాత్రికేయులపై నిర్దిష్టత లేని నేరారోపణలు చేశారు. వాటితో సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. ఉపా కింద అరెస్టయిన జర్నలిస్టులు బెయిల్ పొందడానికి ముందు నెలల తరబడి జైళ్లలో మగ్గాల్సి వస్తోంది. సిద్ధిక్ కప్పన్ అనే పాత్రికేయుడు బెయిల్ పొందడానికి ముందు 28 నెలలు జైలులో గడిపారు. ప్రభుత్వ చర్యలు ఇలాగే కొనసాగితే వాటిని సరిదిద్దే పరిస్థితే ఉండదు' అని వివరించాయి. ఈ లేఖపై వివిధ నగరాలకు చెందిన ప్రెస్‌క్లబ్‌లు, మీడియా సంస్థలు సంతకాలు చేశాయి.










