Oct 08,2023 22:30

-అఖిలపక్ష భేటీ జరపాలని డిమాండ్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం ఒక లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపుల పున్ణపరిశీలనకు కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు కోరితేనే కేంద్రం జోక్యం చేసుకోవాలి తప్ప ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, గెజిట్‌ విడుదల చేయడం చట్ట విరుద్ధ్దమని అన్నారు. తెలంగాణా ఎన్నికల్లో బిజెపి లబ్దిపొందేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆపేందుకు మీ వ్యక్తిగత పలుకుబడిని ఉపయోగించాలని కోరారు. ఈ అంశంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా అది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని రాష్ట్ర విభజన చట్టంలో ఉభయతారకంగా రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరిగిందన్నారు. ఇప్పటిదాకా వున్న నీటి వాటాలను తిరగదోడడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతించరాదన్నారు. న్యాయ స్థానాల ద్వారా పోరాటం చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తీసుకురావాలని అందుకు రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీల మద్దతును కూడగట్టేందుకు తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణాజలాల అంశంపై ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి పున:సమీక్ష నిర్ణయాన్ని ఆపాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు మీ నాయకత్వంలో ప్రధానివద్దకు అఖిలపక్ష కమిటీని తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేశారు.