May 10,2023 22:20

తోషఖానా అవినీతి కేసులో దొషిగా నిర్ధారణ
దేశవ్యాప్తంగా పిటిఐ కార్యకర్తల నిరసలు

ఇస్లామాబాద్‌ : అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను బుధవారం ఇక్కడ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, ఆయనకు ఎనిమిది రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ఓ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఇస్లామాబాద్‌ హైకోర్టుకు హాజరైన ఇమ్రాన్‌ను పారా మిలటరీ రేంజరు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఖజానాకు రూ.5వేల కోట్లకు పైగా నష్టపరచిన అల్‌ఖదీర్‌ ట్రస్టు కేసులో విచారణ ప్రారంభమైన వెంటనే, ఖాన్‌ను 14రోజుల పాటు రిమాండ్‌కు పంపాల్సిందిగా నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఎబి) తరపు లాయర్లు కోరారు. ఖాన్‌ తరపు న్యాయవాది స్పందిస్తూ, తన క్లయింట్‌పై నమోదైన అభియోగాలన్నీ కల్పితాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాగా, ప్రభుత్వ బహుమతుల అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాల వివరాలను దాచడానికి సంబంధించి రెండవ కేసు కూడా జిల్లాసెషన్స్‌ కోర్టులో విచారణ జరగనుంది. గతేడాది పాక్‌ ఎన్నికల కమిషన్‌ ఈ కేసును దాఖలు చేసింది. పాలకులకు, పార్లమెంటేరియన్లకు, బ్యూరోక్రాట్లకు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు, విదేశీ ప్రముఖులు ఇచ్చే బహుమతులను ప్రధానిగా రాయితీ ధరకు కొనుగోలు చేసి వాటిని లాభాలకు అమ్ముకున్నారన్నది ఈ రెండో కేసు సారాంశం.
దేశవ్యాప్త సమ్మెకు పిటిఐ పిలుపు
పలు నగరాల్లో నిరసనలు
ఇమ్రాన్‌ అరెస్టును తీవ్రంగా నిరసిస్తున్న పిటిఐ నాయకత్వం సమ్మెకు సిద్ధం కావాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. పెరుగుతున్న ఫాసిజాన్ని నిరసించాలని, ఏదో ఒకటి తేల్చుకునే క్షణం ఆసన్నమవుతోందని పేర్కొంది. ఇస్లామాబాద్‌, రావల్పండి, లాహోర్‌, కరాచి, గుజ్రాన్‌వాలా, ఫైజలాబాద్‌, ముల్తాన్‌, మర్దన్‌ నగరాల్లో పిటిఐ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కరాచిలో పోలీసులతో ప్రదర్శకులు ఘర్షణ పడ్డారు. పోలీసు వాహనాలపై రాళ్ళు విసరడం, వీధి లైట్లను పగలగొట్టడం చేశారు. ఇమ్రాన్‌ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.
మరోపక్క తమ నేతను కలుసుకునేందుకు, విచారణను చూసేందుకు వస్తున్న పిటిఐ నేతలను లోపలకు రానివ్వకుండా విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీడియాను కూడా లోపలకు రానివ్వడం లేదు. తమను అనుమతించనందుకు నిరసనగా పిటిఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి, సెక్రటరీ జనరల్‌ అసద్‌ ఉమర్‌లు పోలీసులపై కేసు వేసేందుకు హైకోర్టుకు వెళ్ళారు. కానీ ఈలోగానే వారిద్దరినీ అరెస్టు చేశారు. ఉమర్‌పై రెండు కేసులు నమోదు చేశారు. అంతకుముందు ఖురేషి మీడియాతో మాట్లాడుతూ, శాంతియుత నిరసన అనేది రాజ్యాంగ హక్కు, దాన్ని ఉపయోగించుకోండి, అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కార్యకర్తలను కోరారు.