Aug 03,2023 08:17
  •  కేంద్ర మంత్రిని కలిసిన సిపిఎం ఎంపి బ్రిట్టాస్‌, సంఘ నేతలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బీమా సంస్థల పింఛనుదారులు కుటుంబ పెన్షన్‌ను 30 శాతం పెంచాలని ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ (ఎఐఐపిఎ) కోరింది. ఈ మేరకు బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌, ఎఐఐపిఎ నాయకులు కలిసి వినతిపత్రం సమార్పించారు. లైఫ్‌, జనరల్‌ రెండింటిలోనూ పబ్లిక్‌ సెక్టార్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల పెన్షనర్లను ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన సమస్యలను ఆమెకు వివరించారు. కుటుంబ పెన్షన్‌ను ఏకరీతిగా 30 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేశారు. తాము ఎల్‌ఐసి, ఇతర పబ్లిక్‌ సెక్టార్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల్లో అత్యధిక సంఖ్యలో పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, అత్యుత్తమ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎల్‌ఐసిని నిర్మించేందుకు తమ వంతు కృషి చేశామని చెప్పడానికి గర్వపడుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. సేవల నుండి పదవీ విరమణ చేసిన తరువాత కూడా, తాము తమ ప్రచారం ద్వారా ఈ సంస్థల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళుతున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ, ఆర్‌బిఐలో పెన్షన్‌ పథకాలతో వచ్చే ప్రయోజనాలు ఎఐసి, పిఎస్‌జిఐ సంస్థల పెన్షనర్లకు అందడం లేదని తెలిపారు. ఎల్‌ఐసి, పిఎస్‌జిఐ కంపెనీలలో కుటుంబ పెన్షన్‌ చెల్లింపులో 15 శాతం ఉండగా, కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలో దీనిని 30 శాతానికి పెంచారని వివరించారు. 2019 సెప్టెంబరు నాటికి కుటుంబ పెన్షన్‌ను ఏకరీతి రేటు 30 శాతానికి పెంచాలని ఎల్‌ఐసి బోర్డ్‌ సిఫార్సు చేసిందని, జనరల్‌ ఇన్సూరర్స్‌ పబ్లిక్‌ సెక్టార్‌ అసోసియేషన్‌ (జిఐపిఎస్‌ఎ) పాలకమండలి కూడా 2021 డిసెంబర్‌లో సిఫార్సు చేసిందని తెలిపారు. ఈ సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రస్తుతం అందుతున్న కుటుంబ పింఛను సరైన జీవన ప్రమాణాలను నిర్వహించడానికి సరిపోవడం లేదని, చాలా మంది కుటుంబ పింఛనుదారులు ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని తెలిపారు. అందువల్ల, ఈ సిఫార్సుల ఆమోదం కోసం వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, కుటుంబ పెన్షనర్లకు సహాయం చేయాలని కోరారు. పింఛనుదారులు, కుటుంబ పింఛనుదారులందరికీ డియర్నెస్‌ అలవెన్స్‌ (డిఎ) ఏకరీతి రేటు చేసే ఒక ఫార్మూలాను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.