- మొలాసిస్‌పైనా తగ్గింపు
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : చిరు ధాన్యాల (మిల్లెట్ల) పిండిపై పన్ను రేట్లను తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్పత్తులను ప్రీ ప్యాకేజ్డ్ లేదా లేబుల్ వేసి విక్రయించినా ఇకపై 5 శాతం జిఎస్‌టి వర్తిస్తుంది. విడిగా విక్రయించే మిల్లెట్స్ పిండిపై జిఎస్‌టిని పూర్తిగా మినహాయించారు. ఎక్కువ పౌష్టికాహారం కలిగిన ఈ ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో జిఎస్‌టి కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన 52వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం నిర్ణయాలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. తృణ ధాన్యాల పిండిపై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జిఎస్‌టిని 5 శాతానికి తగ్గించామన్నారు. మిల్లెట్లను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తృణధాన్యాలలోకి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగెలు, రాగులు, కుసుములు తదితరాలు వస్తాయి.
మొలాసిస్‌పై కూడా జిఎస్‌టిని 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్ ఆల్కహాల్‌ను జిఎస్‌టి నుంచి మినహాయిస్తున్నామన్నారు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్ (ఇఎన్‌ఎ)పై మాత్రం జిఎస్‌టి యథావిధిగా కొనసాగుతుందన్నారు. భారతీయ రైల్వేస్ సరఫరా చేసే వస్తు సేవలపైనా పన్ను విధించాలని ప్రతిపాదించింది. వాటర్ సప్లరు, పబ్లిక్ హెల్త్, శానిటేషన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ స్లమ్ ఇంప్రూవ్‌మెంట్ తదితర సర్వీసులపై పన్ను మినహాయించారు. జిఎస్‌టి అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడి పదవీ విరమణ వయసును 67 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు, ట్రిబ్యునల్ సభ్యుల పదవీ కాలం 65 ఏళ్ల నుంచి 67 ఏళ్లకు పెంచుతూ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఈ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.










