Sep 04,2023 09:46
  • వర్షాభావంతో ఉమ్మడి కర్నూలులో ఎండిపోతున్న పంటలు
  • సాధారణం కన్నా 50 శాతం లోటు

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సాగు అంతంత మాత్రంగానే ఉంది. కర్నూలు జిల్లాలో మొత్తం సాధారణ సాగు 10,53,900 ఎకరాలు కాగా 7,56,662.5 ఎకరాల్లో రైతులు విత్తనాలు వేశారు. విత్తనాలు విత్తే సమయంలో వర్షాలు పడకపోవడంతో సాగుకు రైతులు అసక్తి చూపలేదు. కర్నూలు జిల్లాలో ప్రధాన పంటగా ఉండే పత్తి సాధారణ సాగు 6,25,067.5 ఎకరాలు కాగా 4,55,577.5 ఎకరాల్లో సాగు చేశారు. వేరుశనగ సాధారణ సాగు 1,66,407.5 ఎకరాలు కాగా 97,447.5, వరి సాధారణ సాగు 32,272.5 ఎకరాలకు కాను16,510, కంది సాధారణ సాగు 59,822.5 ఎకరాలకు 47,925, ఉల్లి సాధారణ సాగు 38,582.5 ఎకరాలు కాగా 25,095 ఎకరాలు మాత్రమే సాగు చేశారు. నంద్యాల జిల్లాలో ప్రధాన పంటగా ఉండే వరి సాధారణ సాగు 1,76,315 ఎకరాలు కాగా కేవలం 45,062.5 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ సాగు 1,04,745 ఎకరాలకు 86,125, కంది సాధారణ సాగు 93,877.5 ఎకరాలకు 73,680, వేరుశనగ సాధారణ సాగు 39,510 ఎకరాలు కాగా 21,050, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 63,965 ఎకరాలు కాగా ఇప్పటి వరకూ 23,287.5 ఎకరాల్లో సాగైంది. ఉల్లి సాధారణ సాగు 10,182.5 ఎకరాలు కాగా 4,997.5, మిరప సాధారణ సాగు విస్తీర్ణం 25,010 ఎకరాలు కాగా 13,050 ఎకరాల్లో సాగైంది. గతేడాది తెగుళ్లతో మిర్చి పంట దెబ్బతినడంతో ఈ ఏడాది మిరప పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.
          ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాభావం ఏర్పడటంతో సాగు చేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఆగస్టు నెలలో కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో 24 మండలాల్లో సాధారణ వర్షపాతంలో 50 శాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. చిప్పగిర మండలంలో సాధారణ వర్షపాతంలో ఒక్క శాతం మాత్రమే పడింది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల్లో 26 మండలాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. పాములపాడు మండలంలో 93 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. వర్షాలు లేక నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

1

                                                                       తీవ్రంగా నష్టపోతున్నాను

మూడు ఎకరాలలో పత్తి, వేరుశనగ పంటను సాగు చేశాను. ఎకరాకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టాను. వర్షం లేక పంటలు ఎండు ముఖం పట్టి తీవ్రంగా నష్టపోతు న్నాను. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించాలి.
                                                                                                    - లక్ష్మన్న, కుమ్మర వీధి, పత్తికొండ.

2

                                                                  పశువులకు మేత కూడా రాదు

నాకు రాంపల్లి గ్రామంలో ఉన్న ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. గత నెల అంతా వర్షాలు రాక పోవడంతో పంట అంత ఎండిపోయింది. కనీసం పెట్టబడి కూడా వచ్చేటట్లు లేదు. గత సంవత్సరం అరకొరగా వర్షాలతో కొంతవరకు పెట్టబడి సహాయం వచ్చింది. ప్రస్తుతం ఆ పరిస్థితికనిపించడం లేదు. ఇక రెండు మూడు రోజుల్లో వర్షం పడకపోతే కనీసం పశువులకు మేత కూడా రాదు.
                                                                          - కందనాతి లక్ష్మీనారాయణ, రాంపల్లి, తుగ్గలి మండలం.