Jul 01,2022 09:41
  • జూన్‌ ముగిసినా 6 జిల్లాల్లో తక్కువ వర్షం
  • నెమ్మదిగా ఖరీఫ్‌ సాగు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : జూన్‌ చివరి వారంలో నైరుతి రుతుపవనాలు కాస్త పుంజుకున్నాయి. అయినప్పటికీ ఆరు జిల్లాల్లో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షాలు కురిశాయి. వైఎస్‌ఆర్‌ జిల్లాలో నార్మల్‌ కంటే అత్యధికంగా 79 శాతం మేర వర్షపాతం నమోదుకాగా ఎన్‌టిఆర్‌ జిల్లాలో నార్మల్‌లో కనిష్టంగా 50.3 శాతం తక్కువ వర్షం పడింది. రాష్ట్రంమొత్తమ్మీద 198 మండలాల్లో తక్కువ వర్షం కురిసింది. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో అతి ఎపిలోనే కనిష్ట వర్షం పడింది. సాధారణంలో 89 శాతం తక్కువ. ఖరీఫ్‌ పనులకు జూన్‌ మాసం ముఖ్యమైనది కాగా నెలాఖరునాటికి పంటల సేద్యం బాగా నెమ్మదిగా సాగుతోంది. 1 నుండి 30 మధ్య ఎపి సగటు సాధారణ వర్షపాతం 97.5 మిల్లీమీటర్లకు 99.9 మిమీ పడింది. నార్మల్‌ కంటే కేవలం 2.5 శాతం ఎక్కువ.
 

                                                              198 మండలాల్లో లోటు

ఎన్‌టిఆర్‌, పల్నాడు, మన్యం, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో తక్కువ వర్షం నమోదైంది. వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, కోనసీమ, పశ్చిమగోదావరి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, అనంతపురంలో నార్మల్‌ కంటే ఎక్కువ వర్షం కురిసింది. అల్లూరి, విశాఖ, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, నంద్యాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా 312 చోట్ల నార్మల్‌ కంటే ఎక్కువగా, 198 మండలాల్లో నార్మల్‌ కంటే తక్కువ, 169 మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షం పడింది.
 

                                                                     అంతంతే..

ఖరీఫ్‌ సేద్యం అంతంతమాత్రంగానే సాగుతోంది. ఈ నెలాఖరుకు అన్ని పంటలూ కలిపి 4.14 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 2.17 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. నార్మల్‌లో 57 శాతమే సాగు నమోదైంది. వేసవి పంటలని, ముందస్తుగా డెల్టాకు సాగునీరని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ నిరుటి కంటే కూడా వరి నాట్లు తక్కువే పడ్డాయి. గోదావరి డెల్టా కాల్వలకు జూన్‌ 1న, కృష్ణా డెల్టా కాల్వలకు 10న సాగునీరు విడుదల చేసినా వరి నాట్లలో పెద్దగా పురోగతి లేదు.
      కాకినాడ, కోనసీమ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో సాగు జీరో. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరిలో అంతంతమాత్రం. ఒక్క పశ్చిమగోదావరిలోనే కొద్దిమేర సేద్యం సాగుతోంది. ప్రకాశం, విజయనగరంలో ఒక మేరకు ముందస్తు పంటలు వేశారు. ఇప్పటి వరకు వరి 45 వేల హెక్టార్లలో సాగైంది. గతేడాది ఇదే సమయానికి 79 వేల హెక్టార్లలో వేశారు. ఆహారధాన్యాలు ఇప్పటికి 1.79 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 64 వేల హెక్టార్లలో వేశారు. నిరుడు ఇదే సమయానికి 96 వేల హెక్టార్లలో సాగయ్యాయి. వేరుశనగ, పత్తి సాగు నిరుటి కంటే స్వల్పంగా పెరిగింది.