Jul 25,2023 08:38
  • ఆరేళ్లలో రూ.57 వేలకోట్లు మిగులు
  • కొన్ని రాష్ట్రాల్లో రైతుకు ఒక్క పైసా చెల్లించలేదు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రధాన మంత్రి పంటల బీమా పథకంతో ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు రూ.57,621 కోట్లు లాభం కలిగిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన (పిఎంఎఫ్‌బివై) వల్ల రైతుల కంటే, ప్రైవేటు బీమా కంపెనీలకే లాభం జరుగుతుందని ఎఐకెఎస్‌ వంటి రైతు సంఘాలు మొదటి నుంచి పేర్కొంటున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తుంది. అయితే గణాంకాలు ఎఐకెఎస్‌ చెప్పేందే వాస్తవమని పేర్కొంటున్నాయి. మోడీ ప్రభుత్వం 2016లో ప్రారంభించిన పిఎంఎఫ్‌బివై పథకాన్ని బీమా కంపెనీలు ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. రాజ్యసభలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో గడిచిన ఏడేళ్లలో బీమా కంపెనీలు రూ.1,97,657 కోట్లను ప్రీమియంగా స్వీకరించాయని, దాదాపు రూ.1,40,036 కోట్లను రైతులకు క్లెయిమ్‌ల రూపంలో చెల్లించాయని పేర్కొన్నారు. సుమారు రూ.57,621 కోట్లు ప్రైవేటు కంపెనీలకు ఆదా అయ్యాయని తెలిపారు.
                2022-23లో బీమా కంపెనీలు రూ.27,900 కోట్ల ప్రీమియం పొందాయి. పంట నష్టానికి సంబంధించి రైతులకు కేవలం రూ.5,760 కోట్లు చెల్లించాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేటు బీమా కంపెనీలు రైతులకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. అయినప్పటికీ వందల కోట్లు ప్రీమియం రూపంలో పొందాయి. మధ్యప్రదేశ్‌లో ఒక ప్రైవేటు బీమా సంస్థ రూ.672 కోట్ల ప్రీమియం పొందిందని, అయితే పంట నష్టం క్లెయిమ్‌ లేదని డేటా వెల్లడించింది. పిఎంఎఫ్‌బివై కింద, రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో బీమా మొత్తంలో నామమాత్రంగా 2 శాతం, రబీలో 1.5 శాతం, రెండు సీజన్‌లలో వాణిజ్య పంటలకు 5 శాతంతోపాటు ప్రీమియంగా చెల్లిస్తారు. మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాలు 50:50 చొప్పున చెల్లిస్తాయి. క్లెయిమ్‌లు చెల్లించకపోవడం, ఆలస్యంగా చెల్లింపులకు సంబంధించి, చాలా ఫిర్యాదులను పరిష్కరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పేర్కొంది.