ప్రజాశక్తి-హైదరాబాద్ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి శనివారం సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రతి శనివారం సిబిఐ విచారణకు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు షరతు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9.40 గంటలకు ఆయన తన న్యాయవాదితో కలిసి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి వచ్చారు. అవినాష్‌రెడ్డి ఒక్కరినే విచారణ హాలులోకి సిబిఐ అనుమతించింది. ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభించిన సిబిఐ అధికారులు సాయంత్రం 5.30 గంటల వరకు ప్రశ్నించారు. ఆయన ఉపయోగిస్తున్న సెల్ ఫోన్లలోని డేటాను సిబిఐ అధికారులు సేకరించినట్లు తెలిసింది. వివేకా హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను అధికారులు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.










