Aug 13,2023 22:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తనపై పదేపదే జరుగుతున్న దాడులపై సిబిఐ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు విడివిడిగా లేఖలు రాశారు. తనపై జరుగుతున్న దాడుల వెనుక నేరపూరిత కుట్ర ఉందని పేర్కొన్న ఆయన, వాటిని ప్రాణాంతక దాడులుగా అభివర్ణించారు. ఈ లేఖల్లో ఆయన రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదిన జరిగిన ఒక బహిరంగ సభలో సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఉద్దేశ్యపూర్వకంగానే తన భద్రతను తగ్గించినట్లు అర్ధమౌతోందన్నారు. తనపై దాడులు చేస్తూ అదే సమయంలో తనపైనే హత్యాయత్నం ఆరోపణతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపారు. తన భద్రతను పునరుద్ధరించిన హైకోర్టు పట్ల కూడా జగన్‌పూర్తి ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులను వివరించేందుకు రాష్ట్రంలో తాను పర్యటిస్తున్నానని, ఈ పర్యటనల్లో అధికారపార్టీ అవినీతి బట్టబయలు అవుతుండటంతో దాడులకువిగుతున్నారని తెలిపారు. ఆగస్టు 4న అంగళ్లులోని మూడు రోడ్ల కూడలిలో తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పుంగనూరు పట్టణంలోకి తనను అనుమతించబోమని వైసిపి గూండాలు బహిరంగంగానే ప్రకటించినా స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంపై గతంలో డ్రోన్‌లు ఎగురవేశారని,మంత్రి జోగి రమేష్‌ తన నివాసంపై 2021లో దాడి చేసినా ఇప్పటికీ చర్యలు లేవని పేర్కొన్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే వైసిపి గుంపు తనపై రాళ్లు రువ్వుతుందని వివరించారు. నందిగామ, యర్రగొండపాలెంలో తనపై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి సీనియర్‌ వైద్యులు సుధాకర్‌ మరణం, వైసిపి ఎంపి రఘురామ కృష్ణంరాజు పోలీసు కస్టడీ, టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు అరెస్టులను వివరించారు. టిడిపి కార్యాలయంపై దాడి ఘటన, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను రాజకీయ ప్రత్యర్ధులపై నెట్టివేయడానికి ప్రయత్నించారని తెలిపారు.