ఆరోగ్య పర్యవేక్షకురాలి వేధింపులే కారణం!
ప్రజాశక్తి- త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య పర్యవేక్షకురాలి వేధింపులకు తాళలేక ఆశా కార్యకర్త ఆత్మహత్యానికి పాల్పడ్డాయి. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.... వితంతురాలైన నీలం అరుణజ్యోతి... త్రిపురాంతకంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె చిన్న కుమారుడు కిరణ్ గుండెపోటుతో మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై అనారోగ్యం బారిన పడ్డారు. ఇటీవల కాలంలో త్రిపురాంతకం పిహెచ్‌సి ఆరోగ్య పర్యవేక్షకురాలు శాంతి ఏంజెల్ జిల్లాలో ఎక్కడా లేనివిధంగా ఆశాలపై, ఆరోగ్య కార్యకర్తలపై తనదైన శైలిలో పెత్తనం చేస్తున్నారు. తనకు లంచం ఇవ్వాలంటూ వారిని అనేక విధాలుగా వేధిస్తున్నారు. లంచం ఇవ్వకపోతే వారితో రోజుకో రికార్డు రాయిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. నెలలో మూడు రోజులు చేసే ఉద్యోగానికి రూ.10 వేలు వేతనం అవసరమా? మీకు చేతకాకపోతే నాకు డబ్బులు ఇస్తే రికార్డులు రాసుకుంటాను అంటూ వారిని తూలనాడుతూ, తిడుతూ అగౌరవ పరుస్తున్నారు. గత శనివారం బ్రహ్మంగారి కాలనీలో తనిఖీలకు వచ్చిన ఆమె అక్కడి ప్రజలు, తోటి ఉద్యోగుల మధ్యలో అరుణజ్యోతిని రికార్డులు చూపించాలని అడిగారు. తన వద్ద ఉన్న రికార్డులను చూపించగా వాటిని ఆరోగ్య పర్యవేక్షకురాలు చించివేయడమే కాకుండా నోటితో ఉచ్చరించలేటువంటి మాటలతో అరుణజ్యోతిని అందరి ముందూ అవమానించారు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన అరుణజ్యోతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని తన వద్ద ఉన్న మాత్రలను ఎక్కువ మొత్తంలో సోమవారం మింగేశారు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం అందించడంతో కోలుకున్నారు. ఈ విషయమై అరుణజ్యోతి మాట్లాడుతూ ఆరోగ్య పర్యవేక్షకురాలు తనను నానా దుర్భాషలాడుతూ అవమానించారని, మూడు వారాల నుంచి తనను తీవ్రంగా వేధిస్తున్నారని, లంచం ఇవ్వకపోతే ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానని హెచ్చరించారని, దీంతో, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని కన్నీరుమున్నీరుగా విలపించారు.










