కోయంబత్తూర్ : సనాతన ధర్మంపై తమిళనాడు క్రీడాశాఖామంత్రి ఉదయనిధిస్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలకు మద్రాస్ హైకోర్టు మందలించింది. తాజాగా అత్యున్నతన్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్టాలిన్‌కు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సనాతన ధర్మంపై మాట్లాడినందుకే ఉదయనిధి స్టాలిన్‌ను బిజెపి టార్గెట్ చేసిందని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ అన్నారు. మక్కల్ నీది మయ్యిమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'సనాతన ధర్మంపై మాట్లాడినందుకే బిజెపికి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ అయ్యారు. సనాతన ధర్మం గురించి గతంలో ఉదయనిధి తాత డిఎంకె నేత ఎం. కరుణానిధితోపాటు పలువరు నేతలు మాట్లాడారు.' అని అన్నారు. అలాగే ఈ సందర్భంగా కమల్ తమిళ దిగ్గజ నేత పెరియార్ వి.రామస్వామిని గుర్తు చేసుకున్నారు. సామాజిక రుగ్మతలపై వి.రామస్వామికి ఎంత కోపం ఉండేదో ఆయన జీవితం నుండే మనం అర్థంచేసుకోవచ్చు. పెరియార్ లాంటి నాయకుడి వల్లనే తనలాంటి వారు సనాతన అనే పదాన్ని అర్థం చేసుకున్నారని కమల్ అన్నారు. పెరియార్ ఆలయ నిర్వాహకుడిగా ఉన్నప్పుడు కాశీలో పూజలు కూడా చేశారు. అయితేనేం.. ఆయన జీవితమంతా ప్రజలకు సేవ చేయడానికే అంకితం చేశారని కమల్ అన్నారు. పెరియార్ తమకు మాత్రమే చెందినవాడని అధికార పార్టీ డిఎంకె లేదా మరే ఇతర పార్టీ వాదించదు. తమినళనాడు రాష్ట్రం ప్రజలందరూ ఆయనను తమ నాయకుడిగా చూస్తారని, గౌరవిస్తారని..తాను కూడా వ్యక్తిగతంగా పెరియార్‌ని గౌరవిస్తానని కమల్ అన్నారు. ఇక ఈ సమావేశంలో బిజెపి సౌలభ్యం కోసం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే వెళ్లొచ్చని కమల్ అభిప్రాయపడ్డారు.










