తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
చెన్నై : అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శనివారం ప్రకటించారు. రాష్ట్ర అవయవదాన దినం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 'అవయవ దానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉంది. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. మరణానంతర అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలి. మిగిలిన వాళ్లు కూడా అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలి. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరపున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం' అని సిఎం స్టాలిన్ పేర్కొన్నారు.










