- ఒకటి నుంచి అమలుకు కసరత్తు
- టైమ్‌స్టాల్ బుక్ చేసుకున్న 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- ఆందోళనలో డాక్యుమెంట్ రైటర్లు
- 3న విజయవాడలో రాష్ట్ర సమావేశం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్స్, అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రస్తుతం వాడకంలో ఉన్న కార్డ్ 1.0 వెర్షన్ స్థానంలో ఇకపై 2.0 వెర్షన్ అమలులోకి రానుంది. కొత్త వెర్షన్‌ను ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి అందుబాటులోకి తెస్తున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ దశలవారీ సెప్టెంబరు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నూటికి నూరు శాతం అమలయ్యేలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆ శాఖ కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్-ప్రైమ్ 2.0) అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ విధానం అమలు ద్వారా భౌతికంగా డాక్యుమెంట్లు లేకుండా ఇ-డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరంగా చేసుకునే అవకాశం కలగనుంది. ఈ వెర్షన్ అమలు ద్వారా తమకు పని లేకుండా పోతుందని, తమ కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాయని డాక్యుమెంట్ రైటర్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా స్టాంప్ వెండర్ల పొట్ట కొట్టేలా ఈ నిర్ణయం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ వ్యవహారాలు డిజిటల్ సంతకాలతో సాగనుందని, డిజిటల్ సంతకం ఎక్కడైనా పొరబాటున చోరీకి గురైతే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని డాక్యుమెంట్ రైటర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 3న విజయవాడ జింఖానాగ్రౌండ్ సమీపంలోని కందుకూరి కళ్యాణ మండపంలో రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో కొత్త వెర్షన్‌పై చర్చించి ఏ రకమైన భవిష్యత్తు కార్యాచరణ చేపట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు డాక్యుమెంట్ రైటర్ల సంఘం పేర్కొంటోంది. డాక్యుమెంట్ రైటర్ల వాదన ఒకలా ఉంటే ఫ్రభుత్వ వాదన మరోలా ఉంది. ప్రభుత్వమేమో ఆధునిక సాఫ్ట్‌వేర్‌తో భూముల కొనుగోలు, అమ్మకాల ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సులభతరమవుతుందని పేర్కొంటోంది. అంతేకాకుండా 2.0 వెర్షన్ ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తాము తయారు చేసుకున్న దస్తావేజు సాఫ్ట్‌కాపీ అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవచ్చని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ పేర్కొంది. నూతన విధానం ద్వారా దస్తావేజుల్లో వివరాలను ఎవరికి వారే నమోదు చేసుకోవడం వల్ల తప్పులు లేకుండా ఉంటాయని, ఆధార్‌తో లింక్ చేయడం వల్ల తప్పుడు వ్యక్తులు రిజిస్ట్రేషన్లకు పాల్పడే ప్రమాదం లేకుండా చేయొచ్చని పేర్కొంటోంది. డాక్యుమెంట్లు స్కానింగ్ ప్రక్రియ ఉండదు కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 20 నిమిషాల్లో పూర్తవుతుందని ఆశాఖ తెలిపింది. నూతన విధానం ద్వారా తాము చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు వివరాలను తామే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చని, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు సులభతరంగా ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించవచ్చని ప్రభుత్వం పేర్కొంటోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం తమకు కన్వీనియంట్ టైమ్‌లో స్లాట్ బుక్‌చేసుకుని 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని, ఈ విధానంలో వినియోగదారులు ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ వద్దకు తీసుకువెళ్లనవసరం లేదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ పేర్కొంది.










