- పోలీస్ అధికారుల తీరు దుర్మార్గం
- వ్యకాస ఆధ్వర్యాన కొవ్వలిలో నిరసన
ప్రజాశక్తి - దెందులూరు (ఏలూరు జిల్లా) : 'భూమి మాదే, పంట మాదే, హక్కులు మాకే దక్కాలి' అంటూ నినదిస్తూ వ్యకాస ఆధ్వర్యాన ఏలూరు జిల్లా దెందులూరులోని కొవ్వలిలో మంగళవారం రెండు రోజు నిరసనగా దోసపాడు పేదలు, దళితులు చేపలు పట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత పి ఆనందరావు మాట్లాడుతూ గతేడాది నుండి బాధితులు భూముల కోసం మొక్కవోని దీక్షతో పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. చెరువుల వద్ద చేపలు పడుతున్న నేపథ్యంలో ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ సిబ్బందితో వచ్చి మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే రెవెన్యూ అధికారులు పరిష్కరించాల్సి ఉండగా పోలీసులు జోక్యం చేసుకుని దళితులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దళితులను హెడ్ కానిస్టేబుల్ రమేష్ నోటికొచ్చినట్లు దూషించడం తగదన్నారు. ఉన్నతాధికారుల ముందే బాధితులను హెడ్ కానిస్టేబుల్ దుందుడుకుగా వ్యవహరిస్తూ కించపరుస్తున్నారని తెలిపారు. చేపల చెరువుల వద్దకు తీసుకెళ్లిన ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో పెద్దఎత్తున ఆందోళన, పోరాటాలకు సిద్ధమవుతావని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సిహెచ్ జాన్‌రాజు, నాగేంద్ర, పవన్, రవికుమార్, మణి, మాణిక్యం, గౌరీ, శ్రీను, ఏసుమణి తదితరులు పాల్గొన్నారు.











