Jul 14,2023 22:35

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కడప ఎంపి అవినాష్‌రెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు జారీచేసింది. ఆగస్టు 14న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. శుక్రవారం సిబిఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ జరిగింది. ఈ కేసులో అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉదరుకుమార్‌రెడ్డిలను నిందితులుగా చేరుస్తూ ఇటీవల సిబిఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను సిబిఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వివేకా హత్యకేసులో ఎంపి అవినాష్‌రెడ్డిని సిబిఐ ఎనిమిదో నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో ఆరు, ఏడో నిందితులుగా భాస్కర్‌రెడ్డి, ఉదరుకుమార్‌రెడ్డి ఉన్నారు. శుక్రవారం నాటి విచారణకు చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితులందరూ హాజరయ్యారు. వారందరికీ ఆగస్టు 14 వరకు కోర్టు రిమాండ్‌ పొడిగించింది.