May 05,2023 16:47

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జిల్లాలో కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద 423 జంటలకు రూ.3.17 కోట్లు పంపిణీ వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలు నిరుపేదలకు ఆర్థిక భరోసానిచ్చే కార్యక్రమాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన జంటలకు బటన్ నొక్కి ఆర్థికసాయం అందించగా, ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వీసీ ద్వారా పాల్గొని కృష్ణా జిల్లాలో 423 జంటలకు రూ.3.17 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లి ఖర్చులు తల్లిదండ్రులకు భారం కాకూడదని, వారికి ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద పెళ్లికూతురు తల్లుల ఖాతాల్లో ఆర్థికసాయం జమ చేయడం జరుగుతున్నదన్నారు. ఈ పథకం కింద లబ్ది పొందుటకు పదవ తరగతి పాస్ అవ్వాలని కనీస అర్హతగా నిర్ణయించడం చదువును ప్రోత్సహించే పథకంగా అభివర్ణించారు. అమ్మఒడి, జగనన్న విద్యాదీ వెనన,జగనన్న వసతి దీవెన పథకాలతో చదువుకోవడానికి ఆర్ధిక సాయం అందించడంతో పాటు చదువు అయ్యాక వివాహ వయస్సు వచ్చిన ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. కావునా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్ పర్సన్ బివి కేడీ నాగలక్ష్మీభవానీ, మార్కెట్ యార్డు చైర్మన్ అచ్చాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ ్సలార్ దాదా, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, డిఆర్ డిఎ పీడీ పీఎస్ఆర్ .ప్రసాద్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షంషున్నీసా, పథక లబ్దిదారులైన దంపతులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.