ప్రజాశక్తి-మడకశిర : సామాజిక సేవలో ప్రధానంగా యువత పునరంకితం కావాలని యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బూతన్న పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ఆర్.అనంతపురం గ్రామం మండల ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో సోమవారం వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) విద్యార్థులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సామాజిక సేవా దృక్పథంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బూతన్న మాట్లాడుతూ నేటి యువతే భావిభారత భవిష్యత్తు సారధులని కొనియాడారు. ముఖ్యంగా సాంఘిక రుగ్మతలైన కులవివక్ష, అంటరానితనం, నిరక్షరాస్యత, బాలిక విద్య పట్ల చిన్నచూపు, తదితర వాటిని రూపు మాపడంలో భాగంగా గ్రామీణుల్లో అవగాహన కల్పించడంతో పాటు చైతన్యం తీసుకు రావాలని పిలుపునిచ్చారు. వాటితో పాటు పచ్చదనం-పరిశుభ్రత, ఎయిడ్స్‌పై అవగాహన, వ్యవసాయ-పాడి పరిశ్రమ పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఈ వారం రోజుల్లో గ్రామంలో అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పహ వంటి ప్రక్రియల ద్వారా స్ఫూర్తి, చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు , సర్పంచి శివ గంగప్ప, అధ్యాపక బందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










