May 21,2023 22:32

మైనింగ్‌ యజమానులు, కార్మికులతో ముఖాముఖి మాట్లాడుతున్న నారా లోకేష్‌
పాదయాత్రలో నారా లోకేష్‌ వెంట బిసి జనార్దన్‌రెడ్డి, నాయకులు
పాదయాత్రలో నారా లోకేష్‌ వెంట బిసి జనార్దన్‌రెడ్డి, నాయకులు

 

యువగళం... జనసంద్రం
- బనగానపల్లె నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర
- కోవెలకుంట్లలో ఘన స్వాగతం
ప్రజాశక్తి-బనగానపల్లె/కోవెలకుంట్ల

       టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం బనగానపల్లె నియోజకవర్గంలో సాగింది. బనగానపల్లె మండలం అమడాలమెట్ట నుంచి ప్రారంభమైన పాదయాత్ర సౌదరదిన్నె, కోవెలకుంట్ల, భీముని పాడు, కంపమల్ల మెట్ట నుండి ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు విడిది కేంద్రం వరకూ సాగింది. సౌదరదిన్నె రైతులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. అకాల వర్షాలకు మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదని తెలిపారు. వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. కోవెలకుంట్ల అమ్మవారిశాల వద్ద ఆర్యవైశ్యులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి నిమ్మ, దానిమ్మ, బత్తాయి, ఖర్జూర, బొప్పాయి వంటి వాణిజ్య పంటల ఎగుమతికి అవకాశం కల్పిస్తే వ్యాపారులకు మేలు జరుగుతుందని లోకేష్‌ దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా ఆర్యవైశ్యులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. కోవెలకుంట్లలో కుందూనది పోరాట సమితి నాయకులు లోకేష్‌ను కలిశారు. కుందూనదిని ప్రభుత్వం లోతు, వెడల్పు చేయడం వల్ల ఎండాకాలంలో నీరు నిల్వ ఉండటం లేదని తెలిపారు. చెక్‌ డ్యాములు నిర్మించి నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జొలదరాశి, రాజోలి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తామని, కుందూ పరివాహక ప్రజల తాగు, సాగు నీటి కష్టాలు తీరుస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా కోవెలకుంట్ల జనసంద్రంగా మారింది. లోకేష్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు పక్కన బారులు తీరారు. ఉపాధి హామీ ఉద్యోగులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని, జీతాల్లో కోత విధించారని తెలిపారు. ఉపాధి హామీ ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు అమడాలమెట్ట విడిది కేంద్రం వద్ద మైనింగ్‌ యజమానులు, కార్మికులతో లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ మైనింగ్‌ కార్మికులకు మెరుగైన జీతాలు, ఆరోగ్య బీమా, ఈఎస్‌ఐ సదుపాయం, ప్రమాద బీమా అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోవెలకుంట్లలో బిజెపి నాయకులు సునీల్‌ చల్‌ రెడ్డి వారి మిత్రబృందంతో లోకేష్‌ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. గడ్డం బ్రదర్స్‌ ఆధ్వర్యంలో నారా లోకేష్‌, బీసీ జనార్దన్‌ రెడ్డిలకు గజమాలతో ఆహ్వానం పలికారు. ఈ పాదయాత్రలో బనగానపల్లె నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి బిసి.జనార్ధన్‌రెడ్డి, డోన్‌ ఇంఛార్జి ధర్మవరం సుబ్బారెడ్డి, నందికొట్కూరు ఇంఛార్జి మాండ్ర శివానందరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామకృష్ణారెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ గడ్డం నాగేశ్వర్‌ రెడ్డి, గడ్డం అమర్నాథరెడ్డి, అమడాల మద్దిలేటి, వల్లంపాడు సర్పంచి జగదీశ్వర్‌ రెడ్డి, ఎంపిటిసి కత్తి సురేష్‌ బాబు, బిజినవేముల డి.హుస్సేనయ్య, చిలమకూరి వెంకట సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, పెనుగొండ రాజశేఖర్‌, మోహన్‌ రెడ్డి, చిన్న కొప్పెర్ల వెంకట సుబ్బారెడ్డి, వల్లంపాడు నారాయణరెడ్డి, కలుగొట్ల అర్జున్‌ రెడ్డి, కంపమల్ల సుబ్బారెడ్డి, పొట్టిపాడు సుబ్బారెడ్డి, కులాయి భాష, మురళి, హరి, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.