May 23,2023 21:23

భూమా నాగిరెడ్డి సమాధి వద్ద నివాళ్లులర్పిస్తున్న నారా లోకేష్‌

యువగళానికి విశేష స్పందన
- అన్ని సీట్లలో టిడిపిని గెలిపించండి
- ఉమ్మడి కర్నూలును నెంబర్‌ వన్‌ చేస్తా : లోకేష్‌
ప్రజాశక్తి-ఆళ్లగడ్డ

      రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపిని అన్ని సీట్లలో గెలిపిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాను అబివృద్ధిలో నెంబర్‌ వన్‌ చేసి చూపిస్తానని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. మంగళవారం యువగలం పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలో ఆయన పాదయాత్ర సాగింది. బైపాస్‌ విడిది కేంద్రం నుండి నాలుగు రోడ్ల సెంటర్‌, టిబి రోడ్డు మీదుగా పాత బస్టాండ్‌ వరకు పాదయాత్ర జరిగింది.. పాత బస్టాండ్‌ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అహౌబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి నవనరసింహులు కొలువైన ఆధ్యాత్మిక కేంద్రం ఆళ్లగడ్డ అని, బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కరువులో అందరికీ అన్నం పెట్టిన దానకర్ణుడు బుడ్డా వెంగల్‌ రెడ్డి, ఆళ్లగడ్డ శిల్పాలకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉందని ఎంతో చరిత్ర ఉన్న ఆళ్లగడ్డ లో పాదయాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని తమ సొంత అమ్మలా భావించి స్వర్గీయ భూమా దంపతులు ఎంతో అభివద్ధి చేశారన్నారు. తెదేపా హయాంలోనే ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివద్ధి చెందిందన్నారు. భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత రెడ్డి లను ఇబ్బందులు పెడుతున్న వారిని వెంటాడి, వేటాడుతామని వచ్చేది అధికారంలోకి తామేనని నారా లోకేష్‌ అన్నారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దొబ్బి ఇప్పుడు ఏమి తెలియని అమాయకుడిలా పేదవాడిని అని జగన్‌ అంటున్నాడని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన వాటికే మరలా శంకుస్థాపన చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తామన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా సిపిఎస్‌ రద్దు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 200 వారాలు దాటిన సిపిఎస్‌ రద్దు చేయలేదన్నారు. పోలీసులు దాచుకున్న డబ్బులను వదల లేదన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ లను వేధిస్తున్నారని టిడిపి వచ్చిన వెంటనే వారికి న్యాయం చేస్తామన్నారు. ముస్లింల కోసం ఇస్లామిక్‌ బ్యాంకును ఏర్పాటు చేస్తామన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల నాని కాదని లూటీ నాని అని అన్నారు. ఆళ్లగడ్డలో ఐ టాక్స్‌ అంటే అందరికీ తెలుసని మహిళలను మనం గౌరవించాలని పేరు చెప్పడం లేదన్నారు. ఐ టాక్స్‌తో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ నాకు తెలుసు అన్నారు. ఇసుక, ఎర్రమట్టి కాంట్రాక్టులు, అక్రమ బియ్యం రవాణా ప్రతిదాంట్లో లూటీ చేస్తూ లూటీ నాని దాదాపు 200 ఎకరాలు కొన్నారని వైకాపా కార్యకర్తలు, నాయకులే మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ చెస్సుల పేరుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని, ఆఖరికి దేవుని కూడా వదలలేదని అహోబిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దందా చేస్తున్నారన్నారు. జగన్‌ పాలనలో నిధులు లేక అభివృద్ధి చేయలేకపోతున్నామని మున్సిపల్‌ చైర్మన్‌ ప్రతి సమావేశంలో చెబుతున్నారన్నారు. భూమా అఖిలప్రియ మీకోసం పోరాడుతోందనిఆడ పులి బయటకు వస్తుందని అన్నారు. అనంతరం శోభ ఘాట్‌ వద్దకు చేరుకుని భూమా నాగిరెడ్డి, శోభనాగిరెడ్డి విగ్రహాల వద్ద లోకేష్‌ నివాళులు అర్పించారు. ఈ పాదయాత్రలో టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె, ఆత్మకూరు, పాణ్యం, డోన్‌, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌ రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, బుడ్డ రాజశేఖర్‌ రెడ్డి, గౌరు చరిత, కోట్ల సుజాతమ్మ, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌, చాగలమరి మాజీ సర్పంచ్‌ అన్సర్‌ భాష, కౌన్సిలర్‌ హుస్సేన్‌ బాషా, మాజీ జడ్పిటిసి చాంద్‌ బాషా, రాము యాదవ్‌, కాంట్రాక్టర్‌ నన్నే భారు గారి జిలానీతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.