న్యూఢిల్లీ: యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై జూదం, మద్యం, రాజకీయాలకు సంబంధించిన యాడ్లను ప్రముఖంగా ప్రచురించకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు జూన్ 14న యూట్యూబ్ మాస్ట్‌హెడ్ (యూట్యూబ్ టాప్ పేజీ) కంటెంట్‌కు ఉండాల్సిన అర్హతల జాబితాను విడుదల చేసింది.
గ్యాంబ్లింగ్, ఆల్కాహాల్, పాలిటిక్స్, డ్రగ్స్‌లకు సంబంధించిన యాడ్‌లేవీ ఇకపై యూట్యూబ్ హౌం పేజీలోని పైభాగంలో కనిపించవని యూట్యూబ్ సంస్థ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ''వినియోగదార్ల పట్ల ఇకపై మరింత బాధ్యతగా వ్యవహరించాలని అనుకుంటున్నాం'' అని యూట్యూబ్ తన ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు వినియోగదార్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు, అసత్య ప్రచారాలకు సైతం యూట్యూబ్‌లో చోటు ఉండబోదని స్పష్టం చేసింది. అంతేకాదు యాడ్లకు సంబంధించిన వీడియోల (థంబ్‌నెయిల్స్) విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ''అవి మానసికంగా వినియోగదార్లపై ప్రభావం చూపుతాయి కాబట్టి, అలాంటి యాడ్లను ప్రోత్సహించం'' అని యూట్యూబ్ ప్రతినిథి ఒకరు వెల్లడించారు.
యూట్యూబ్ ఓపెన్ చేయగానే టాప్‌లో కనిపించే ఈ యాడ్స్... ఇకపై వినియోగదార్లకు పనికొచ్చేవి, అవగాహన కలిగించేవి మాత్రమే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు యూట్యూబ్ తెలిపింది.










