Oct 19,2023 23:55

మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు:పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం పాడేరులో అల్లూరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని అంబేద్కర్‌ సెంటర్‌ వద్ద యుటిఎఫ్‌ ఏర్పాటు చేసిన శిబిరంలో ఈ నిరవధిక దీక్షలను జిల్లా సహా అధ్యక్షులు సి.హెచ్‌. నాగేశ్వరరావు ప్రారంభించారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై.విల్సన్‌ బాబు, వి.మహేశ్వరరావు, కె.రఘునాధ్‌ ,పి.దేముడు ఈ నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా నిరాహార దీక్షను ఉద్దేశించి యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణకు యుటిఎఫ్‌ సుదీర్ఘ కాలంగా పోరాటం సాగిస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ ముక్తకంఠంతో పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ కోసం సిపిఎస్‌ రద్దు కోసం పోరాటాలు సాగిస్తున్నారన్నారు. పాత పెన్షన్‌ సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరించాలని వారు డిమాండ్‌ చేశారు.ఈ దీక్షా శిబిరాన్ని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.అప్పలనర్స, సిపిఎస్‌ ఇఏ. జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు, కార్యదర్శి ఎస్‌.లోహిత్‌ సందర్శించి దీక్షలకు తమ సంఘీభావం ప్రకటించారు. పాత పెన్షన్‌ను తక్షమణమే పునరుద్ధరించాలని అప్పలనర్స డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ కె.ఆంద్రేయా, విశ్వరాజు, ఎం.బాబురావు, జె.సత్యనారాయణ, ఎస్‌.కన్నయ్య, జి.ప్రసాద్‌, బి. కమల కుమారి, సీసా గోపి, ఎస్‌.కర్రిబాబు, ఎస్‌.బాలకృష్ణ,యం.రామకృష్ణ, జి.సతీష్‌, యం.మోహాన్‌, తదితరులు పాల్గొన్నారు.