ప్రజాశక్తి - కలెక్టరేట్ : ఉపాధ్యాయులకు 3 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా, కేడర్ స్త్రెంగ్త్ పేరుతో ప్రభుత్వం కపట నాటకం ఆడుతుందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు అన్నారు. మంగళవారం స్థానిక డిఇఒ కార్యాలయం వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యంలో నల్ల బెలూన్లతో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీతాలు చెల్లించకుండా ఉపాధ్యాయులను అగౌరవంతో ప్రభుత్వం చూస్తోందని, మరో ఉపాధ్యాయ దినోత్సవాల పేరున టీచర్లను సన్మానించడం సిగ్గు చేటన్నారు. గతంలో పిఆర్‌సి ఇచ్చేటప్పుడు ఏ ఉద్యోగి బిల్లు పెట్టకుండానే జీతాలు వేసేవారని, ఇప్పుడు కేడర్ స్ట్రెంగ్త్ అప్డేట్ కాలేదని జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. అలాగే జూన్‌లో బదిలీల తర్వాత వెయ్యి మందికి అక్రమ బదిలీలు జరిపిన ప్రభుత్వం కౌన్సిలింగ్ ప్రక్రియకు తూట్లు పొడిచిందని విమర్శించారు. తక్షణమే జీతాలు వెంటనే చెల్లించి, అక్రమ బదిలీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు టి.రమేష్, జిల్లా కార్యదర్శులు కె.మురళి, ఎన్.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










