న్యూఢిల్లీ : ద్వేషాన్ని నిర్మూలించి, భారత్ ఐక్యంగా ఉండే వరకు జోడో యాత్ర చేపడతానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4,000 కి.మీ మేర రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాహుల్ ప్రత్యేకంగా ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు. గతేడాది ఇదే రోజున యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. '' ప్రేమ, ఐక్యత వైపు భారత్ జోడోయాత్ర కోట్లాది అడుగులు రేపటి మెరుగైన దేశ భవిష్యత్ కోసం పునాదిగా మారాయి. ద్వేషాన్ని పూర్తిగా నిర్మూలించి, భారత దేశం ఏకం అయ్యే వరకు ఈ యాత్ర కొనసాగుతంది. ఇది నా వాగ్దానం'' అని హిందీలో ట్వీట్ చేశారు.
భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ 13 మీడియా సమావేశాలతో పాటు 12 బహిరంగ సమావేశాలు, వందకు పైగా కూడళ్లలో చిన్నపాటి సమావేశాలు నిర్వహించారు. ఈ యాత్రలో పలువురు రాజకీయ నేతలతో పాటు మాజీ ఆర్మీ అధికారులు, టివి, సినీనటులు పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు, పిడిపి నేత మెహబూబా ముఫ్తీ, శివసేన ( ఉద్ధవ్ థాకరే) కి చెందిన ఆదిత్యథాకరే, సంజరు రౌత్, ప్రియాంక చతుర్వేది, ఎన్‌సిపి నేతలు సుప్రియా సూలేలతో పాటు ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, కమల్ హాసన్ తదితరులు రాహుల్‌తో పాటు జోడోయాత్రలో పాదం కలిపారు.










