ప్రజాశక్తి-సాలూరు : మండలంలోని శివరాంపురం నదీ పరివాహక ప్రాంతం నుంచి యధేచ్ఛగా ఇసుక దోపిడీ కొనసాగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ రవాణా సాగుతున్నప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదు. వాస్తవంగా ఇక్కడ ఇసుక రీచ్ అధికారికంగా లేకపోయినా నిల్వలు అధికంగా వున్నాయి. దీంతో స్థానిక అధికారపార్టీ నాయకుల అండతో వారి అనుచరుల ట్రాక్టర్‌ల్లో ఇసుక రవాణా సాగిస్తున్నారు. శివరాంపురంలో సుమారు 30 ట్రాక్టర్‌లు వున్నాయి. కానీ కేవలం అధికారపార్టీ నాయకుల అండదండలు వున్న వారి ట్రాకర్ల ద్వారా మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నారు. ఈవాహనాలలో ఇసుక రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినా అధికారులు గాని, ఎస్‌ఇబి అధికారులు గాని స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానిక వైసిపి నాయకుడి అండతో ఇసుక తరలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇతరులెవరైనా ఇసుక రవాణా చేస్తే వారు ఫిర్యాదు చేస్తారు, అధికారులు స్పందించి కేసు నమోదు చేస్తున్నారు. ప్రతిరోజూ 20 ట్రాక్టర్లలో ఇసుక రవాణా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో అయితే ట్రాక్టర్ ఇసుక 3వేలు, దూర ప్రాంతాలకు అయితే 4వేలకు విక్రయిస్తున్నారు. మండలంలో మిగిలిన ప్రదేశాలలో కూడా ఇదేవిధంగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. నియోజకవర్గంలో పాచిపెంట మండలం మోసూరు ప్రాంతంలో, పట్టణంలోని కాకుల తోట నదీ పరివాహక ప్రాంతం నుంచి యధేచ్ఛగా ఇసుక రవాణా సాగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు.
పిక్క రాయి,మట్టి పై ఆంక్షలు
ఇసుక దోపిడీని వదిలేసిన ప్రభుత్వం గత కొంతకాలంగా క్వారీల నుంచి కొనుగోలు చేసే పిక్క రాయి, మట్టిపై ఆంక్షలు విధించింది.ఉమ్మడి జిల్లాలో పిక్క రాయి, మట్టి రవాణా పై అదనంగా పన్ను వేస్తోంది. రాఘవేంద్రా కన్ స్ట్రక్షన్ కంపెనీ కి ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో ఆ కంపెనీ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా తనిఖీ లు నిర్వహిస్తున్నారు. క్వారీల నుండి తెచ్చుకున్న పిక్క రాయి ట్రాక్టర్ పై రూ.1200 అదనంగా టాక్స్ వసూలు చేస్తున్నారు. దీంతో గృహ నిర్మాణ దారులు, కాంట్రాక్టరులపై అదనపు భారం పడుతోంది.
వీరఘట్టం : మండలంలోని పనస నందివాడ గ్రామ సమీపాన నాగావళి నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రెవెన్యూ, పోలీస్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడంతో ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా విచ్చల విడిగా తవ్వకాలు జరిపి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగించడం వల్ల అక్రమార్కులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారాలు కొనసాగించి జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణా చేయకూడదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ అధికారులు అక్రమదారులపై కనీసచర్యలు చేపట్టకపోవడంతో ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపి ఇసుకను దోచుకుపోతున్నారు. ఈ విషయమే తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ వద్ద ప్రజాశక్తి ప్రస్తావించగా ఇసుక అక్రమ రవాణా తమ దృష్టికి వచ్చిందని, ఆ ప్రాంతంలో విఆర్వోలను కూడా అందుబాటులో ఉంచడంతో పాటు పరిశీలన జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు.










