ప్రజాశక్తి-పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలో యానిమేటర్లుగా గత 20 సంవత్సరాలు నుంచి పనిచేసున్న వారిని అధికారులు తొలగిస్తున్నారని ఈ విషయంలో యానిమేటర్లకు న్యాయం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ మేరకు వారు సోమవారం పెనుకొండ సబ్ కలెక్టర్ కె. కార్తీక్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, రికవరీ చేయించడం, ప్రభుత్వ పథకాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఇలా యానిమేటర్లు అనేక సేవలందిస్తున్నారని అన్నారు. అయితే వీరు కనీస వేతనం లేకున్నా గౌరవ వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారని తెలిపారు. యానిమేటర్ల కడుపు కొట్టకుండా వారిని అలాగే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ ,రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు హరి, సిఐటియు మండల కార్యదర్శి బాబవలి, తిప్పన్న, వసంతమాల, సునీత, సరస్వతి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










