Jul 13,2023 06:13

కులం, మతం, జాతుల పేరుతో ఎక్కడ ఏ విధ్వంసం జరిగినా ఆమే లక్ష్యమవుతుందని అనేకసార్లు నిరూపితమైంది. గుజరాత్‌, ముజఫర్‌నగర్‌, ఢిల్లీ ఎక్కడ అల్లర్లు జరిగినా ఆమే బలౌతోంది. అయితే దాడులు, లూటీలు, హత్యలతో రెండునెలలుగా రగిలిపోతున్న మణిపూర్‌ హింసలో మాత్రం ఇంతవరకు ఎక్కడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడం లేదు. కానీ, వాస్తవం వేరేలా ఉంది. అల్లర్లు మొదలైన రెండో రోజే వాటి తీవ్రతను పెంచేలా కొంతమంది సృష్టించిన తప్పుడు వార్తల ప్రభావంతో కుకీలు, మెయితీల తెగకు చెందిన మహిళలు దారుణ అత్యాచారానికి, హత్యలకు గురౌతున్నారు. అయితే, ఏ ఒక్క మహిళా తనపై జరిగిన దారుణాన్ని బయటపెట్టడం లేదు. మన సమాజంలో ఇది మహిళల గౌరవానికి భంగం కలిగించే అంశంగా భావించటం, అక్కడి అధికారులు నిందితులకు కొమ్ముకాస్తారనే భయం ... నిజాలు బయట రాకుండా అడ్డుపడుతున్నాయి.
మణిపూర్‌లో అల్లర్లు మొదలైన కొన్ని గంటల వ్యవధిలోనే.. ఆ హింసను, దాడులను తీవ్రం చేయాలన్న లక్ష్యంతో కొంతమంది తప్పుడు వార్తలు సృష్టించారు. ఓ ప్లాస్టిక్‌ సంచిలో కుక్కబడిన యువతి శవాన్ని చూపిస్తూ.. అది కుకీ పురుషుల దాడిలో దారుణంగా అత్యాచారానికి గురైన మెయితీ తెగకు చెందిన నర్సింగ్‌ విద్యార్థిని అన్న వీడియో ఇందులో ఒకటి. నిజానికి అది తప్పుడు వార్త. 2022లో ఢిల్లీలోతల్లిదండ్రులచే చంపబడిన యువతి సంఘటనకు సంబంధించిన వీడియో అది. కానీ, ఈ తప్పుడు వార్త జన బాహుళ్యంలోకి వెళ్లిపోయింది. ఇది రెండు తెగలకు చెందిన మహిళలపై ప్రతీకార దాడులకు ప్రేరణ అయింది.

  • ప్రతీకార దాడులే..

బిష్ణపూర్‌ జిల్లా తౌబుల్‌ గ్రామ శివారు పంట పొలంలో 40 ఏళ్ల మహిళను ఈడ్చుకెళ్లి ఓ మూక అత్యాచారానికి తెగబడింది. ఆ బృందంలో 15 ఏళ్ల మైనర్‌ బాలుడు కూడా ఉన్నాడు. 'వారంతా మద్యం తాగి వున్నారు. మీ పురుషులు మా మహిళలకు చేసిన గతే మీకు కూడా పడుతుంది. ప్రతీకారం తీర్చుకునేదాకా ఎవరినీ వదిలిపెట్టం' అంటూ వారంతా గట్టిగా అరుస్తూ నాపై పడ్డారు' అని చెబుతున్నప్పుడు భయంతో ఆమె మాటలు తడబడుతున్నాయి. మే 6.. కంగ్పోక్పి జిల్లా ఫైతాయించింగ్‌ గ్రామంలో 45 ఏళ్ల వితంతువును అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. మే 15న 18 ఏళ్ల కిమ్‌ను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశారు.
అలైస్‌, మేరీ (పేర్లు మార్చబడ్డాయి) ఇంఫాల్‌లో ఓ కారు వాష్‌ పార్క్‌లో పనిచేసేవారు. వారి తల్లిదండ్రులు మాత్రమే, తమ బిడ్డలను దారుణంగా అత్యాచారం చేసి చంపేసారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు వార్త వైరల్‌ అయిన కొన్ని గంటల్లో వ్యవధిలోనే ఈ ఇద్దరు యువతులూ అత్యాచారానికి గురయ్యారు. తమను వెంటాడుతూ వస్తున్న గుంపు నుంచి రక్షించుకునేందుకు వారు కార్‌ వాష్‌ షెడ్డులో దాక్కున్నారు. వెంటాడిన వ్యక్తులు ఆ ఇద్దరినీ బలవంతంగా లాక్కెళ్లి ఓ గదిలో కొన్ని గంటలపాటు బంధించి, అఘాయిత్యానికి పాల్పడ్డారు. జుట్టంతా కత్తిరించి, తీవ్రంగా బాధించి, చంపి, రక్తపు మడుగులో వదిలేసి పోయారు.
మే 15 సాయంత్రం.. 18 ఏళ్ల కుకీ యువతి.. ఓ ముస్లిం కుటుంబంలో పని చేస్తోంది. ఆ రోజు ఎటిఎం సెంటర్‌కు వెళ్లేందుకు బయటికి వచ్చింది. అప్పుడు నల్ల టీషర్టులు ధరించిన ఓ మూక బలవంతంగా ఆమెను తమ కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పారు. చేతులు కట్టేసి, కళ్లు మూసేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆమె లేని శక్తినంతా కూడదీసుకుని వారిపై ఎదురుతిరిగింది. ఆ దుండగులు ఓ కొండ ప్రాంతం నుంచి ఆమెని కిందికి తోసేశారు. మూడు రోజుల తర్వాత ఆమె తీవ్ర గాయాలతో పునరావాస కేంద్రానికి చేరుకుంది.

  • సుమోటో అవకాశం లేదు..

'మేము ఈ అత్యాచార వార్తలను వింటూనే ఉన్నాం. ఫిర్యాదులు అందకుండా మేం స్పందించలేం. రెండు వర్గాల నుండి ఆరోపణలు ఉన్నా.. సుమోటోగా తీసుకునే అవకాశం మాకు లేదు' అని బెదిరింపుల భయంతో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి అంటున్నారు. రెండు నెలలుగా జరుగుతున్న హింస.. వందలాది మంది మృత్యువాత, వేలాదిమంది నిరాశ్రయుల మధ్య.. పునరావాస కేంద్రాలకు తరలివస్తున్న ప్రజల్లో దాడులు తాలుకూ భయంకర పరిస్థితులు తమపై జరిగిన లైంగిక హింసను వెనకపట్టు చేస్తున్నాయి' అంటున్నారు ఆ అధికారి.
ప్రస్తుతం మణిపూర్‌ వ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసంలో ఎక్కడో ఓ చోట.. ఏదో మహిళలపై ప్రతీకార దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవ్వరూ నోరు మెదపడం లేదు. కారణమేదైనా సరే ... మనుషులపై మనుషులు దాడి చేసుకోవడం ఒక అనాగరికమైతే ... మహిళలపై ప్రతీకార చర్యకు పాల్పడే ఆలోచన అత్యంత కిరాతకం.

women-sexual-harassment-in-manipur-violence

 

  • ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు..

దాడులకు గురౌతున్న మహిళలెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. 'ఇది చాలా అవమానకరం. తమపై జరుగుతున్న లైంగిక దాడులను బహిర్గతం చేయకపోవడం నిజాన్ని శాశ్వతంగా సమాధిచేయడమే' అని మణిపూర్‌కి చెందిన న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆ మహిళలు స్పందించకపోయినా ఆ దారుణాలను ప్రత్యక్షంగా చూసినవారు, స్పందించిన వారు ఎంతోమంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వారు చెప్పిన విషయాలను బట్టే ఈ దారుణాలు వెలుగు చూశాయి. ఒక్క పునరావాస కేంద్రంలోనే ఆరుగురు కుకీ మహిళలు బాధితులుగా ఉన్నారు. కంగిపోక్పి నుండి వచ్చి తలదాచుకుంటున్న 18 ఏళ్ల యువతికి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఆమె అత్యాచారానికి గురైందని తేలింది. అలాగే 22 ఏళ్ల వైద్య విద్యార్థిని తనపై జరిగిన దాడి అసత్య ప్రచారమని వాదించింది. కానీ, ఆమె బాధితురాలు.