ప్రజాశక్తి-ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : స్టేట్ స్పెషల్ పోలీస్ పార్టీకి వచ్చిన ముందస్తు సమాచారం మేరకు పోలీసులు గొల్లగుప్ప శివారు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి మావోయిస్టు పార్టీ సభ్యురాలు సోడి మంగిని, ముగ్గురు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎటపాక పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రంపచోడవరం ఒఎస్‌డి కెవి.మహేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. ఒఎస్‌డి తెలిపిన వివరాలు ప్రకారం... పోలీసు పార్టీపై మందు పాతర పేల్చి హతమార్చాలని పధకం అమలు భాగంగా మావోయిస్టు పార్టీ నాయకులు, సభ్యులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు గొల్లగుప్ప శివారులో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టు పార్టీ సభ్యురాలు సోడి మంగి, ముగ్గురు మిలీషియా సభ్యులు పట్టుబడ్డారు. మరి కొంత మంది తప్పించుకున్నారు. పట్టుబడ్డ వారి వద్ద నుండి 2 డిటోనేటర్లు, 1 మీటర్ కార్దెక్ష్ వైర్, ఒక బాటరీ, ఐరన్ ముక్కలు, ఎలక్ట్రికల్ వైర్‌లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సోడి మంగి (25)ది ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా, అర్లంపల్లి గ్రామం కాగా, మిలీషియా సభ్యులు మడకం లింగ (24)ది అదే జిల్లా బంగారు చెలక గ్రామం, మడకం రామయ్య (50), కురుసం భీమయ్య (25)లది అదే జిల్లా మైత గ్రామం. సోడి మంగి 2018లో మావోయిస్టు పార్టీ సభ్యురాలిగా చేరారు. ఆమె చింతూరు సబ్ డివిజన్ పరిధిలోనూ, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం పరిధిలోనూ 25 నేరాల్లో ముద్దాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎటపాక మండలం చెరువు గుంపు గ్రామానికి చెందిన మడివి రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసి ఛత్తీస్‌ఘడ్ మైత వద్ద చంపిన ఘటనలో, చింతూరు మండలం సరివెల వద్ద ట్రావెల్స్ బస్సు దహనం ఘటనలో, బురకన కోట గ్రామంలో సోయం సుబ్బయ్యను పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో చంపిన ఘటనలో పట్టుబడిన నలుగురు పాల్గొన్నారు. జీరగూడలో పోలీసులపై మావోయిస్టులు జరిపిన అంబుష్ దాడిలో 22 మంది సిఆర్‌పిఎఫ్ కమాండోలు మరణించిన ఘటనలో సోడి మంగి పాల్గొన్నట్లు ఒఎస్‌డి మహేశ్వరరెడ్డి వెల్లడించారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎవరైనా సహకరించినా, సంఘ విద్రోహక చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మావోయిస్టుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని మహేశ్వరరెడ్డి కోరారు. ఈ సమావేశంలో సిఆర్‌పిఎఫ్ 141 బెటాలియన్ సెకెండ్ ఇన్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, అసిస్టెంట్ కమాండెంట్ హేమంత్ కుమార్ శర్మ, ఎటపాక సిఐ గజేంద్ర కుమార్, ఎస్సై కె పార్థ సారధి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










