లండన్ : వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించిన కారణంగా....ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం వాట్సప్‌కు ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ సుమారు రూ.1,950 కోట్ల జరిమానా విధించింది ! వినియోగదారుల వ్యక్తిగత వివరాలను ఫేస్‌బుక్ అనుబంధ సంస్థలతో పంచుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూ యూరోపియన్ యూనియన్ తెచ్చిన నిబంధనలను ఉల్లంఘించినట్లు డేటా ప్రొటెక్షన్ కమిషన్ నిర్ధారించింది. దీంతో 225 మిలియన్ యూరోల జరిమానాను వాట్సప్‌కు విధిస్తూ గురువారం నిర్ణయాన్ని ప్రకటించింది.
నిబంధనలకు వాట్సప్ తూట్లు పొడిచింది : ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్
పౌరుల వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పిస్తూ 2018లో యూరోపియన్ యూనియన్ 'జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్' పేరున మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. సామాజిక మాధ్యమాలు వీటిని తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ నిబంధనలకు వాట్సప్ తూట్లు పొడిచిందని కమిషన్ పేర్కొంది. యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగా డేటా ప్రాసెసింగ్ విధానాలను మార్చుకోవాలని ఆ సంస్థకు మరోసారి సూచించింది.
మూడు నెలల గడువు : డిపిసి
జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జిడిపిఆర్) సూత్రం ప్రకారం.. వ్యక్తుల డేటాను ప్రాసెస్ చేస్తున్న సంస్థలు వారి సమాచారాన్ని ఉపయోగించేటప్పుడు ఆ వ్యక్తులతో స్పష్టంగా, బహిరంగంగా, నిజాయితీగా వ్యవహరించాలి. ఫేస్‌బుక్‌కు వినియోగదారుల డేటాను ఇచ్చే విషయంలో పారదర్శకత వహించాలి. ఈ అవసరమైన ప్రమాణాన్ని నిర్వర్తించడంలో వాట్సప్ విఫలమైందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డిపిసి) నిర్ధారించింది. దీంతో భారీగా జరిమానా విధించడంతో పాటు వినియోగదారుల పట్ల తమ పారదర్శకత స్థాయిని మెరుగుపర్చుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వాట్సాప్‌ను డిపిసి ఆదేశించింది. ఆదేశాలు అమలు చేసేందుకు ఈ సంస్థకు మూడు నెలల గడువునిచ్చింది.
విబేధించిన వాట్సప్..
ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ తమకు జరిమానా విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో వాట్సప్ విభేదించింది.ఈ భారీ జరిమానాను అసంబద్ధమైనదని పేర్కొంది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొంది.










