Jul 31,2023 17:06

కోల్‌కతా :   అమర్త్యసేన్‌కు మద్దతు తెలుపుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన దళిత విద్యార్థి సోమ్‌నాథ్‌ సౌ (21) ని విశ్వభారతి యూనివర్శిటీ (విబియు) సస్పెండ్‌ చేసింది. శాంతినికేతన్‌లో భూమిని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ.. ఖాళీ చేయాలంటూ విబియు నోటీసులు పంపుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి పరువును తీయడం ఆపాలంటూ సోమ్‌నాథ్‌ తన పోస్ట్‌లో విబియుని కోరారు.

''నాతో పాటు చాలా మంది విద్యార్థులు ఫేస్‌బుక్‌లో అమర్త్యసేన్‌కి మద్దతు తెలిపారు. అయితే నేను ఎస్‌సి కమ్యూనిటీకి చెందిన వాడిని కావడంతో యూనివర్శిటీ విసి నన్ను టార్గెట్‌ చేశారు. యూనివర్శిటీ విసి ఆలోచనల్లో ప్రమాదకరమైన జాతి విద్వేషం ఉంది. మూడో సెమిస్టర్‌కి హాజరుకాకుండా సస్పెన్షన్‌ నోటీసులు ఇచ్చారు'' అని సోమ్‌నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్‌సి జాతీయ కమిషన్‌కి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. విబియు నోటీసులు చట్టవిరుద్ధమని, వీటిపై హైకోర్టుని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.

గతేడాది విశ్వభారతి యూనివర్శిటీ ఫ్యాకల్టీ అసోసియేషన్‌ (విబియుఎఫ్‌ఎ) సెక్రటరీ, ప్రొఫెసర్‌ సుదీప్తా భట్టాచార్య సస్పెన్షన్‌ను రద్దు చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆ నిరసనలో తాను కూడా పాల్గొన్నానని, విసి తనను సస్పెండ్‌ చేయడానికి ఇది కూడా ఓ కారణమని అన్నారు.

జనవరి 2019 నుండి 2022 ఏప్రిల్‌ మధ్య వివిధ అభియోగాలతో సుమారు 160 మంది అధ్యాపకులకు, 70 మంది స్టాఫ్‌ సభ్యులకు షోకాజ్‌ నోటీసులిచ్చినట్లు సమాచారం. తన అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన తమపై దాడి చేసేందుకు విసి గూండాలను కూడా పంపినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు.

''బిద్యుత్‌ చక్రవర్తి లాంటి వ్యక్తిని ఈ ప్రఖ్యాత యూనివర్సిటీ విసిగా కొనసాగించడం ద్వారా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏమి నిరూపించాలనుకుంటుందో మాకు తెలియదు. అతని కారణంగా యూనివర్శిటీలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు షోకాజ్‌, సస్పెన్షన్‌ నోటీసులు ఇస్తున్నారు. విసి విప్‌ అతని అప్రజాస్వామిక పనితీరుకు వ్యతిరేకంగా అన్ని నిరసనలను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది'' అని సోమ్‌నాథ్‌ మండిపడ్డారు.