Jul 29,2022 17:06

న్యూఢిల్లీ : తాను కుట్రకు బలయ్యాయని అవినీతి కేసులో అరెస్టైన బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా చటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్థా విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలు, బదిలీలు పెద్దమొత్తంలో మడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. పార్థాతో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ అరెస్టయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన సోదాల్లో సుమారు 50 కోట్ల నగదు.. 5 కిలోల బంగారాన్ని ఇడి స్వాధీనం చేసుకుంది. అయితే అర్పిత వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయని, వాటి నిండా డబ్బు ఉందన్న సమాచారంతో వాటి కోసం ఇడి గాలింపు చర్యలు చేపట్టింది. ఈ కుంభకోణంతో ఆయన్ను బెంగాల్‌ ప్రభుత్వం మంత్రి పదవుల నుండి తొలగించింది. ప్రస్తుతం ఇడి అదుపులో ఉన్న ఆయన్ను మెడికల్‌ చెకప్‌ కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. తాను కుట్రలో బాధితునయ్యానని అన్నారు.

కారు దిగనని మొండికేసిన అర్పిత
ఈ కుంభకోణంలో అరెస్టైన అర్పిత ముఖర్జీని కూడా మరోసారి ఇడి అధికారులు జోకా ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అక్కడ నాటకీయ సన్నివేశం చోటుచేసుకుంది. ఆమెను అక్కడకు తీసుకెళ్లగా కారులోంచి దిగేందుకు అర్పిత మొండికేశారు. ఏడుస్తూ కారు దిగేందుకు నిరాకరించగా.. భద్రతా సిబ్బంది బలవంతంగా ఆమెను కిందకు దించారు. అయినప్పటికీ ఆమె వెళ్లేందుకు నిరాకరించడంతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ చాలా నాటకీయ సన్నివేశం చోటుచేసుకున్నది. కారులో ఉన్న అర్పిత బయటకు వచ్చేందుకు నిరాకరించింది. ఏడుస్తూనే సీట్లోనే కూర్చుండిపోయింది. అయితే భద్రతా సిబ్బంది ఆమెను బలవంతంగా కారులోంచి దించారు. ఆ తర్వాత చెకప్‌ కోసం హాస్పిటల్‌ లోపలికి తీసుకువెళ్తున్న సమయంలో ఆమె ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌ వద్ద రోడ్డుమీదే బైఠాయించారు. ఆ తర్వాత ఆమెను వీల్‌చైర్‌పై తీసుకువెళ్లారు.