ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
వరుణుడు రైతులతో దోబూచులాడుతున్నాడు. రోజూ అక్కడక్కడ తుంపర్ల వర్షం కురవడంతో సరైన వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలకు విత్తనాలు వేద్దామనుకుంటే విత్తనాలు, ఎరువులను అందించడంలో ఆర్‌బికెలు విఫలమవుతున్నాయి...
మండలంలో ఖరీఫ్ సీజన్‌లో 46,500 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 22,500 ఎకరాల్లో పత్తి, 500 ఎకరాల్లో వేరుశనగ, మిగతా అక్కడక్కడ సాగు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు సరైన వర్షాలు కురవలేదు. ప్రస్తుతం తుంపర్లతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఫర్టిలైజర్ ఎరువులు యూరియా, డిఎపి, పటాస్, ఎన్‌పికె ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు అధికమవుతోంది. అంత ఖర్చు పెట్టి పండించినా పంట దిగుబడి వస్తుందో లేదో, వాటికి గిట్టుబాటు ధర ఉంటుందో, లేదో తెలియని పరిస్థితి. గ్రామాల్లో రైతులకు సరైన సమయానికి ఎరువులు అందజేసేందుకు అని ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికే పత్తి విత్తనం నాటుకున్న రైతులు సరైన వర్షాలు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. విత్తనం మొలకెత్తకపోవడం, వాతావరణం అనుకూలించక తెగులు వచ్చి పంటలను గొర్రెలకు వదిలేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అవగాహన లేక నష్టపోయాను
- రైతు, హరిజన బతుకన్న
నేను 2.5 ఎకరాల్లో పత్తి పంట వేశాను. పత్తి పంటకు తెగులు రావడంతో చెట్లు ఎర్రగా కావడంతో గొర్రెలకు వదిలేశాను. నాకు బోరు నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించకపోవడంతో నష్టపోయాను.
ఏ పంట వేయాలో తెలియడం లేదు
- రైతు, మారెప్ప, తిమ్మాపురం గ్రామం
ఈ సీజన్‌లో సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఏ పంట వేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. గతంలో 1.50 ఎకరాల పొలంలో బోరు వేయించాను. మోటార్ కనెక్షన్ కోసం రూ.5 వేలు ఎపిఎస్‌పిడిసిఎల్‌కు డిపాజిట్ చేశాను. పొలంలో ఉండే మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులను కోరాను. ఇప్పటివరకు కనెక్షన్ ఇవ్వలేదు. 'నీకు కరెంట్ బిల్ వచ్చింది. కట్టు. లేకపోతే నీ కనెక్షన్ కట్ చేస్తామ'ని విద్యుత్ అధికారులు ఫోన్ చేసి భయపెడుతున్నారు. కనెక్షన్ లేకపోతే బిల్లు ఎలా కట్టాలి.
పేరుకే ఆర్‌బికెలు
- తెలుగు రైతు నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ కెటి.వెంకటేష్
పేరుకే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటి వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగమూ లేదు. బయట మార్కెట్‌లో విత్తనాలు, ఎరువులను దుకాణదారులు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు. గొప్పలు చెప్పుకుంటున్న రైతు భరోసా కేంద్రాల అధికారులు, ఎఒ ఏం చేస్తున్నట్లు. వ్యవసాయ అధికారులు తనిఖీలు చేస్తున్నా విత్తన, ఎరువుల దుకాణాల వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకొని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేటట్లు చూడాలి.
సరైన వర్షాల్లేక పంటలు దెబ్బతిన్నాయి
- ఎఒ మహేశ్వర్ రెడ్డి
మండలంలో 46,500 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 50 శాతం సాగు చేశారు. ఏప్రిల్, మేలో కురిసిన వర్షాలకు రైతులు పత్తి సాగు చేశారు. తర్వాత సరైన వర్షాల్లేక పంటలు దెబ్బతిన్నాయి. ఎర్రనేలల్లో జులై 31 వరకు, నల్లరేగడిలో ఆగస్టు మొదటి వారం వరకు పత్తి, సజ్జ, కొర్రలు, పొద్దుతిరుగుడు, ఆముదం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్‌బికెలలో ఫర్టిలైజర్స్ అందిస్తున్నాం. పెస్టిసైడ్స్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆర్‌బికెలకు, బయట మార్కెట్‌కు పెస్టిసైడ్స్ ధరలో వ్యత్యాసం వల్ల ప్రస్తుతానికి ఆర్‌బికెలలో అందించలేకపోతున్నాం.
వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతు










