Jul 26,2023 22:21

వర్షంలో తడుస్తూ వస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : పుట్టపర్తిలో మంగళ, బుధవారం కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి 192 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. బుధవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురిసినప్పటికీ సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘాలు కమ్ముకొని ఏకధాటిగా కురిసిన జల్లులతో ప్రజలు తమ పనులు చేసుకోవడానికి ఆటంకంగా మారింది. ప్రయాణికులు లేక ఎక్కువ ఆర్టీసీ బస్సులు ఖాళీగా నడిచాయి. మరో రెండు రోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు పనులు మానేయాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా దుక్కి దున్ని చదును చేసుకున్న రైతులు వేరుశనగ పంట పెట్టుకొనుటకు సంసిద్ధులవుతున్నారు. ఈ నెలాఖరి వరకు విత్తనం మెచ్చుకోవచ్చని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పినందున వర్షం తెరపి ఇచ్చిన తర్వాత పంటలు సాగు చేసుకోవటానికి రైతులు సిద్ధమవుతున్నారు.
మడకశిర : మూడు రోజుల నుండి వరుసగా జడి వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లడానికి వానలో నడిచి పోతున్న విద్యార్థులకు ఏం ప్రమాదం జరుగుతుందో అని వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా దిన కూలితో జీవనం గడిపేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో కూలి పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని కూలీలు వాపోతున్నారు. ఇక మల్బరీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తడిసిన ఆకును పురుగులకు వేయడం వల్ల అవి గూళ్లు కట్టకుండా పోతున్నాయని దీంతో నెలరోజుల కష్టపడితే చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోతోందని వాపోతున్నారు. ఇతర ప్రాంతాల నుండి కళాశాలలకు వచ్చే విద్యార్థులు వర్షంలోనే తడిసి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కదిరి అర్బన్‌ : కదిరిలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా గంటపాటు కుండపోత వర్షం కురిసింది. కొద్దిసేపు ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి, ఇలాంటి వర్షం రెండు గంటలు కురిసిందంటే పరిసర ప్రాంతాలలోని చెరువులు, కుంటలు నిండి పొర్లుతాయని ప్రజలు వ్యాఖ్యానించారు.