ప్రజాశక్తి - సాలూరు : పట్టణంలోని గాంధీనగర్‌లో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గత ఏడాదిగా వారు మురుగునీటి ముంపుతో ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షం వచ్చినప్పుడల్లా మురుగునీటి ప్రవాహం అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి చేరుతుంది. దీనితో ఈ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 25కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నారు. పట్టణంలోని శివాజీ సెంటర్ నుంచి వచ్చే ప్రధాన కాలువ ద్వారా మురుగునీరు వేగావతి నదిలోకి ప్రవహించాల్సి ఉంది. దీనికి మురుగునీటి కాలువ కూడా గాంధీనగర్ వీధి గుండా ఉంది. అయితే ఈ కాలువపై ఇళ్లు నిర్మించడంతో దాని నుంచి పూడికతీతలు గత కొంతకాలంగా జరగడం లేదు. భారీ వర్షాలు పడినప్పుడల్లా మురుగునీరు, వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతంలోని అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి చేరుతోంది. ఏడాది క్రితం వరకు అపార్ట్‌మెంట్ వాసులకు లేని ముంపు సమస్య ఇప్పుడు తలనొప్పిగా మారుతోంది. అపార్ట్ మెంట్ వెనుక ఉన్న ప్రయివేటు స్థలాలు గతంలో లోతట్టు ప్రాంతంలో వుండేవి. ముంపునీరు ఆ స్థలాల మీదుగా పొలాల్లోకి చేరుతుండేది. అయితే ఆ స్థలాల యజమానులు లోతట్టు ప్రాంతంలో ఉన్న స్థలాలను మట్టితో కప్పి ఎత్తు చేశారు. ఫలితంగా మురుగునీరు, వరదనీరు కలిసి అపార్ట్‌మెంట్‌సెల్లార్ లోకి చేరుతోంది. అపార్ట్‌మెంట్ చుట్టూ ఉన్న ప్రహరీగోడ శిథిలమవ్వడంతో నీరు సెల్లార్‌లోకి చేరుతోంది. ఈ నీటిని అపార్ట్ మెంట్ వాసులు వారి ముందు నిర్మాణం లో ప్రయివేటు ఆసుపత్రి స్థలంలోకి వదులుతున్నారు. దీంతో తన ఆసుపత్రి నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోందని ప్రయివేటు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణ స్థలంలోకి చేరుతున్న నీటిని వర్షం వచ్చినప్పుడల్లా మోటార్లతో తోడించు కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. దీని వల్ల తనకు ఖర్చు తడిసి మోపెడవుతోందని ఆ వైద్యుడు చెపుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూడాలని అపార్ట్‌మెంట్‌వాసులు గత కొంతకాలంగా ప్రజాప్రతి నిధులు, మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా పరిష్కారం లేదు.
అపార్ట్‌మెంట్‌కు అడ్డగోలు అనుమతులు
2011లో నిర్మాణమైన అపార్ట్‌మెంట్‌కు అప్పటి మున్సిపల్ అధికారులు అడ్డగోలు అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లో వున్న కుటుంబాల వాడుక నీరు బయటకు పోయే మార్గం చూపించలేదు. దీనికి తోడు శివాజీ సెంటర్ నుంచి వచ్చే ప్రధాన కాలువ మురుగునీరు వరదనీరు లోతట్టు ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్ లోకి చేరుతోంది. మురుగు నీరు, వరద నీరు కలిపి వేగావతీ నదిలోకి ప్రవహించేలా కాలువని మున్సిపల్ అధికారులు నిర్మించాల్సి వుంది. అయితే దానికి సరిపడే నిధులు మున్సిపాలిటీ లో లేవని ఇంజనీరింగ్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. సుమారు 12ఏళ్ళ క్రితం నిర్మించిన అపార్ట్ మెంట్ వాసులు మున్సిపాలిటీ కి అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నారు. కానీ వారి మురుగునీటి పారుదల సమస్యకు పరిష్కారం చూపడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
అనుమతులిస్తే డ్రెయిన్ ఖర్చు భరిస్తాం
అపార్ట్ మెంట్ వాసులకు, ప్రయివేటు ఆసుపత్రి నిర్మాణానికి ఇబ్బంది లేకుండా మురుగునీరు వరదనీరు వేగావతీ నదిలోకి ప్రవహించేలా కాలువని నిర్మిస్తే తాము కొంత భరిస్తామని బాధిత కుటుంబాలు, ఆసుపత్రి నిర్మాణదారు చెపుతున్నారు. సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
డిప్యూటీ సిఎంకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు
పట్టణంలో గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సిఎం రాజన్నదొర ఆరో వార్డులో పర్యటించిన సమయంలో అపార్ట్‌మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. సమస్యలు విన్న రాజన్నదొర అక్కడే ఉన్న కమిషనర్ హెచ్.శంకరరావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెయినేజీ మార్గం లేకుండా అపార్ట్‌మెంట్‌కు ఎలా అనుమతులు మంజూరు చేశారని ప్రశ్నించారు. అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది జరిగి ఆరునెలలు కావస్తోంది. అయినా సమస్యకి పరిష్కారం లేదు.
మున్సిపాలిటీలో నిధుల్లేవు : సూరి నాయుడు, ఇన్‌ఛార్జి డిఇ
అపార్ట్‌మెంట్ వాసుల సమస్య పరిష్కారం జరగాలంటే మురుగునీరు వేగావతి నదిలోకి ప్రవహించేలా కచ్చా డ్రెయిన్ నిర్మించాలి. దీనికి నిధులు లేవు.










