ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : జిల్లా కేంద్రంలో వర్షం కురిసిన ప్రతిసారి ప్రధాన రహదారిలో చేరే వరద నీటితో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. పట్టణంలో పాత బస్టాండ్ కూడలి నుంచి సారికివీధి జంక్షన్ వరకు వర్షాకాలంలో వర్షం కురిసిన ప్రతిసారి వరద నీరు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే కాలువల్లోకి వెళ్లేందుకు మార్గం లేక ప్రధాన రహదారిపైనే పొంగిపొర్లుతూ వరద నీరు నిలిచిపోతుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ సమస్య పునరావృతమవుతున్నప్పటికీ అటు అధికారులు గానీ, ఇటు ప్రజా ప్రతినిధులు గానీ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు. శుక్ర, శనివారం మధ్యాహ్నం కురిసిన చిన్నపాటి వర్షానికి ప్రధాన రహదారిపై వరదనీరు నిలిచిపోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఏటా పాలకవర్గం ఆమోదంతో మునిసిపల్ నిధుల నుండి లక్షలాది రూపాయలు వెచ్చించి కాలువల్లో పూడికతీతలు తీస్తున్నప్పటికీ ఫలితం లేకుండానే పోతుందని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా కాలువలపై ఉన్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించి పూడికతీత పనులు చేపట్టి కాలువల వ్యవస్థను ఆధునీకరించితే తప్ప ప్రధాన రహదారిపై పొంగిపొర్లే వరద నీటి సమస్య పరిష్కారం కాదని స్థానికులు అభిప్రాయపడు తున్నారు. ఈ సమస్య పరిష్కారం వైపు స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాటు మున్సిపల్ పాలకవర్గ కౌన్సిల్ సభ్యులు అధికారులు అడుగులు వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.










