Apr 30,2023 22:17

వర్షం, ఈదురు గాలులకు నేలకొరిగిన అరటి

ప్రజాశక్తి బత్తలపల్లి : ఈదురు గాలులు, వర్షానికి మండలంలోనిపండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోతున్నారు. మూడు రోజులుగా వర్షం, ఈదురు గాలులకు మండలంలోని పలు గ్రామాలలో అరటి, మొక్కజొన్న, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మండల వ్యాప్తంగా దాదాపు రూ. 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. మండలంలో శనివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, వానకు చేతికందిన అరటిపంట, మొక్కజొన్న నేలకొరగగా రూ.10లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు శ్రీనివాసులు, పల్లపోతుల శ్రీరాములు వాపోయారు.మండలంలోని ఎం. చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు ఎన్‌. శ్రీనివాసులు తనకున్న మూడు ఎకరాలలో 3600లు అరటి మొక్కలు నాటాడు. మొదటి పంట దిగుబడి చేతికందిన దశలో అమ్మకానికి సిద్ధంగా, మార్కెట్లో ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో ఆశించిన మేరకు లాభం చేకూరుతుందని ఆశపడ్డాడు. అకాల వర్షం ఈదురు గాలులు రైతుల ఆశలపై నీళ్లు చల్లింది, శనివారం రాత్రి వీచిన గాలి,వానకు కోత దశలో ఉన్న 2500ల చెట్లు నేలకొరిగాయి. దీంతో పంటనష్టం అపారంగా వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. తనకు రూ.5లక్షల వరకు నష్టం సంభవించిందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశాడు. అదేవిధంగా మండలంలోని గంటాపురం గ్రామానికి చెందిన పల్లపోతుల శ్రీరాములు ఐదు ఎకరాల పొలంలో మొక్కజొన్న పంట సాగు చేయగా వర్షం, ఈదురు గాలులకు మరో నెల రోజుల్లో కోతకు కోయాల్సిన పంట నేలమట్టమైందని బాధిత రైతు శ్రీరాములు వాపోయాడు. మూడు నెలల క్రితం మొక్కజొన్న పంట సాగు చేయగా రూ.1.50 లక్షలు పంట సాగుకుపెట్టుబడి పెట్టినట్లు చెప్పారు మరో నెల రోజులలో పంట దిగుబడి చేతికి అందితే రూ.3.50 లక్షల వరకు దిగుబడి వచ్చేదన్నారు. ఈ సమయంలో ఈదురు గాలులు తన ఆశలను నీరుగార్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాగే మండలంలోని పలు గ్రామాల్లో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ప్రభుత్వం దెబ్బతిన్న పండ్ల తోటలకు పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.