ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ తెలిపారు. శనివారం నగరంలోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని సందర్శించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.ఫజులుర్ రహమాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ శాఖ కార్యదర్శి యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, సమస్యలు, తదితర విషయాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి.ఫజులుర్ రహమాన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఓర్వకల్లులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణం, యూనివర్సిటీ తాత్కాలిక వసతి కోసం ప్రభుత్వ భవనం కేటాయింపు, రెగ్యులర్ పోస్టుల మంజూరు, యూనివర్సిటీ మెయింటెనెన్సు గ్రాంట్ మంజూరుకు ఉన్నత విద్యా శాఖ, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి, మంజూరు చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఉర్దూ వర్సిటీని పరిశీలిస్తున్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్










